చిన్నారుల కోసం కొత్త అడుగు..

ఆత్మకూర్, ఆంధ్రప్రభ : ఆత్మకూర్ మండలంలోని ఆగ్రంపహాడ్ గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా నూతన అంగన్వాడీ భవనాన్ని హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డితో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులతో మమేకమైన ప్రజాప్రతినిధులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అంగన్వాడీ కేంద్రాలేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బాలల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల విద్యాభివృద్ధికి, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు కీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డైట్ చార్జీల పెంపుతో పాటు ఆధునిక విద్యా ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
మహిళల సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్య, వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కమలాపురం రమేష్, రేవూరి రణధీర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బోరిగం స్వామి, జిల్లా కార్యదర్శులు కక్కెర్ల రాధికా రాజు, కంచ రవికుమార్, మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, సర్పంచులు గంగుల మహేందర్, ముద్దం సాంబయ్య, ఎలుకటి రవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏలియా, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
