వర్షాల రాకకు సంకేతంగా ఎర్రని సందడి..

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ: వర్షాకాలం ఆగమనానికి సంకేతంగా భావించే ఆరుద్ర పురుగులు యాదాద్రి-భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. తొలకరి జల్లులు నేల తల్లిని తాకగానే మట్టిలో నుంచి బయటకు వచ్చే ఈ జీవులు ఎర్రటి రంగులో పంట పొలాలపై పాకుతూ కనువిందు చేస్తున్నాయి.

సాధారణంగా ఆరుద్ర కార్తెలో కనిపించే ఈ పురుగులను రైతులు శుభసూచకంగా భావిస్తారు. నల్లని రేగడి నేలల్లో పూలవలె మెరిసే వీటి దర్శనం వర్షాకాల ప్రారంభానికి సూచికగా చెబుతుంటారు.

కార్తికి ముందే దర్శనం

సాధారణంగా ఆరుద్ర కార్తెలో తొలకరి వర్షాలు కురిసిన తర్వాత కనిపించే ఈ పురుగులు, ఈసారి కార్తికి ముందుగానే రోహిణి కార్తిలోనే ప్రత్యక్షమవడం విశేషంగా మారింది. ఇటీవల కురిసిన జల్లుల అనంతరం మండలంలోని పలు ప్రాంతాల్లో ఇవి దర్శనమిస్తున్నాయి.

రైతుల విశ్వాసం

ఆరుద్ర పురుగులు కనిపించడం వల్ల మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు నమ్ముతారు. భూసారాన్ని పెంచడంలో కూడా ఈ జీవులు ఉపయోగపడతాయని చెబుతారు. మట్టిలోనే పుట్టి, మట్టిలోనే అంతరించిపోయే ఈ చిన్న జీవులు ప్రకృతి చక్రంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

Leave a Reply