Petition | అశ్లీల, ఏఐ కంటెంట్ తొలగించాలని ఆదేశాలు

Petition | అశ్లీల, ఏఐ కంటెంట్ తొలగించాలని ఆదేశాలు

Petition | ఢిల్లీ, ఆంధ్రప్రభ : నాగ చైతన్య వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నటుడి పేరు, ఫొటోలు, రూపం, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలని సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు ఇచ్చింది.

అనధికారిక వినియోగంపై కోర్టు ఆగ్రహం…

జస్టిస్ జ్యోతి సింగ్ ఎదుట విచారణకు వచ్చిన ఈ కేసులో, నాగ చైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ వాదనలు వినిపించారు. కొన్ని వెబ్‌సైట్లు నటుడి పేరు, ఫొటోలను ఉపయోగించి ట్రాఫిక్ పెంచుకోవడం, అభ్యంతరకర, అశ్లీల కంటెంట్‌తో ఆయన పేరును అనుసంధానం చేయడం జరుగుతోందని కోర్టుకు వివరించారు.

అలాగే, నటుడి అనుమతి లేకుండానే ఆయన ఫొటోలు, పోలికలతో టీ-షర్టులు, ఇతర వస్తువులు విక్రయిస్తున్న ఆన్‌లైన్ లిస్టింగ్‌లను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏఐ సాయంతో రూపొందించిన ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచార కంటెంట్, పరువు నష్టం కలిగించే పోస్టులు కూడా వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కంటెంట్ తొలగింపునకు మధ్యంతర ఆదేశాలు…

ప్రాథమికంగా పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాల్లో వాదనలకు బలం ఉందని భావించిన కోర్టు, సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మధ్యవర్తి సంస్థలు అభ్యంతరకర, అనధికారిక కంటెంట్‌ను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జూలై 31కు వాయిదా వేసింది. భారతీయ సినీ ప్రముఖుల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు గతంలో కూడా పలువురు నటులు, ప్రజాప్రతినిధులకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply