శ్రీ శక్తి మహానాడులో పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులు

శ్రీ శక్తి మహానాడులో పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులు
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా పెనుగంచిప్రోలు మండలంలో శ్రీ శక్తి మహానాడు డిజిటల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పెనుగంచిప్రోలు ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కంఠమనేని ఫంక్షన్ హాల్లో జరిగిన మహానాడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎంపీ కేశినేని శివనాధ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ 103వ జయంతిని మహానాడు వేదికగా జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.
రెండు రూపాయల కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులు, పేదలకు గృహ పథకాలు, రైతులకు ప్రోత్సాహక కార్యక్రమాలు వంటి అనేక సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. సినీ రంగంలోనూ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పాత్రలతో కోట్లాది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, వివిధ ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
