అర్ధరాత్రి చెక్పోస్ట్లో ఎస్పీ

అర్ధరాత్రి చెక్పోస్ట్లో ఎస్పీ
- బక్రీద్ నేపథ్యంలో మరిపెడలో ఆకస్మిక తనిఖీలు
- అక్రమ పశువుల రవాణాపై కఠిన ఆదేశాలు
- ఆరు నెలల్లోనే కట్టుదిట్టమైన పోలీసింగ్తో శబరీష్ ప్రత్యేక గుర్తింపు
మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : బక్రీద్ పండుగ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ బుధవారం అర్ధరాత్రి మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్ట్ వద్ద కొనసాగుతున్న వాహన తనిఖీలను పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అక్రమ పశువుల రవాణాను పూర్తిగా అరికట్టాలని స్పష్టం చేశారు. చెక్పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

పశువులను తరలించే వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలు, రవాణా ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలిపారు. అవసరమైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.

