“క్రెడిట్ చోరీ రాజకీయాలు ఆపాలి..

“క్రెడిట్ చోరీ రాజకీయాలు ఆపాలి..

చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: మల్లాది విష్ణు”

విజయవాడ (పాయకాపురం), ఆంధ్రప్రభ : అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్‌పై టీడీపీ ప్రభుత్వం క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికను వైసీపీ కార్యకర్తలతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్ స్మృతివనం, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాలపై టీడీపీ ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ ఆ హామీ నెరవేరలేదని ఆయన అన్నారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున సుమారు రూ.400 కోట్ల వ్యయంతో 206 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిందని తెలిపారు.

అదే విధంగా అంబేద్కర్ స్మృతివనం, డిజిటల్ మ్యూజియం, మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచే ప్రాజెక్టును అమలు చేశారని పేర్కొన్నారు. ఈ డిజైన్లను స్వయంగా జగన్ పరిశీలించారని, అంబేద్కర్ జీవిత చరిత్రను భావితరాలకు చేరేలా మ్యూజియం రూపొందించారని వివరించారు.

కన్వెన్షన్ సెంటర్‌ను గతంలో చంద్రబాబు స్వయంగా ప్రశంసించారని, ఇప్పుడు అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మల్లాది విష్ణు విమర్శించారు.

రుషికొండ ప్రాజెక్టుల విషయంలో కూడా మొదట ప్రశంసలు, తర్వాత విమర్శలు చేయడం టీడీపీ ధోరణిని చూపిస్తోందని ఆయన అన్నారు. “రెండు నాల్కల రాజకీయాలు మానుకోవాలి” అని సూచించారు.

రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రానికి ఏమి చేశారో మహానాడులో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పాలనపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు తాము అధికారంలో ఉండగా రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.

వంగవీటి మోహనరంగా హత్య ఘటనను ప్రస్తావిస్తూ, ఆ సమయంలో జరిగిన రాజకీయాలపై కూడా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పూర్తి శ్వేతపత్రం విడుదల చేయాలని మల్లాది విష్ణు సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో గుండె సుందర్ పాల్, గుడిసె శ్యాము బాబు, మాతా మహేష్, ఓపిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణి, పసుపులేటి కోటేశ్వరరావు, డాక్టర్ రాంబాబు, సురేష్, మనోహర్, మజ్జి రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply