Agriculture Loss | పంట వ్యర్థాల దహనంతో పర్యావరణానికి ముప్పు

Agriculture Loss | పంట వ్యర్థాల దహనంతో పర్యావరణానికి ముప్పు
Agriculture Loss | అగ్ని ప్రమాదాలతో బుగ్గిపాలవుతున్న పంటలు
భూసారం క్షీణతతో దిగుబడిపై తీవ్ర ప్రభావం
రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం
Agriculture Loss | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: మునుపెన్నడూ లేని విధంగా భగభగ మండే ఉష్ణోగ్రతలకు తోడు పంట చేల్లో రోజూ సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరు గాలం కష్టించి పండించిన పంట కళ్లముందే బుగ్గిపాలవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అన్నదాత కన్నీటి పర్యంతమవుతున్నాడు.
మరోవైపు పంట చేల పైనుండి వెళ్లే విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పంటలు కాలి బూడిదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని కనుగుట్టలో వదులైన విద్యుత్ తీగల కారణంగా షార్ట్ సర్క్యూట్ సంభవించి గంట వ్యవధిలోపే 85 ఎకరాల్లో వేసిన జొన్న, మొక్కజొన్న పంట చేనులోని పైపులు, విద్యుత్ మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి.
మావల మండలం బట్టిసావర్గం, గుడిహత్నూర్ మండలం మన్నూరు, నిర్మల్ జిల్లా పెంబి, మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామ శివారులోనూ వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించి వందలాది ఎకరాల్లో వేసిన పంటలు బుగ్గిపాలయ్యాయి. ప్రమాదం జరిగిన చోట వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పంట నష్టంపై నివేదికలు పంపారు. కానీ పరిహారం అందించి ఆదుకున్న దాఖలాలు ఎక్కడా లేవు.
యాసంగిలో పంట చివరి దశలో పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు అగ్నికి ఆజ్యం పోస్తూ వందలాది ఎకరాలు ఆహుతవుతున్నాయి. కొందరు రైతులు, కూలీలు సహజంగా కాల్చి పడేసిన బీడీ ముక్కలు, అగ్గిపుల్లలు లక్షలాది విలువైన పంటలను కాల్చివేస్తున్నాయి.
వ్యర్థాలకు మంటలతో అనర్థాలు
యాసంగి పంట పూర్తయిన తర్వాత జొన్న, మొక్కజొన్న, వరి, పత్తి వంటి పంట వ్యర్థాలను పంట చేనులోనే కాల్చి వేస్తున్నారు. ఈ మంటలు గాలికి వేగంగా వ్యాపిస్తూ పక్కనే ఉన్న చేనును కూడా దహించేస్తున్నాయి. డ్రిప్ ఇరిగేషన్కు వాడే పైపులు, మోటార్లు కూడా కాలి బూడిదవుతున్నాయి.
ఆదిమామడ, సారంగాపూర్, బైంసా, గుడిహత్నూర్, తాండూర్, బోత్, బజార్హత్నూర్, తలమడుగు, కౌటాల, పెంబి మండలాల్లో సుమారు 350 ఎకరాల్లో మామిడి, జొన్న, మొక్కజొన్న, వరి పంటలు అగ్ని ప్రమాదానికి కాలిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా మంటలు భారీగా వ్యాప్తి చెందుతూ పక్కనే ఉన్న అడవులను కూడా దహించి వేస్తున్నాయి. దీంతో విలువైన కలప కాలి పోవడమే కాక పర్యావరణానికి చేటు చేస్తోంది. భూసారం క్షీణించి పంట దిగుబడి కూడా తగ్గుతోంది.
తొందరపాటు చర్యతోనే పంటలకు ముప్పు
తెలంగాణ ప్రాంతానికి సింహద్వారమైన ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా వాతావరణం వేడెక్కుతోంది. గతంలో 35 నుంచి 40 శాతం ఉన్న అటవీ విస్తీర్ణం ఇప్పుడు 23 శాతానికి కుదించుకుపోయింది. వేసవిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు తోడు మానవ తప్పిదాల వల్ల కూడా అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి.
పంట చేనులో కాలిన వ్యర్థాల వల్ల సేంద్రియ కర్బనం అధిక మోతాదులో పెరుగుతోంది. కుళ్లిన వ్యర్థ పదార్థాలను దుక్కి దున్ని చదును చేస్తే సేంద్రియ ఎరువుల వాడకం పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. మంటల వల్ల భూసారం క్షీణించి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఈ విషయాలతో పాటు అగ్ని ప్రమాదాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం.
— శ్రీధర్ చౌహన్, వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త
