రోడ్లపై పశువులు వదిలితే కఠిన చర్యలు..

రోడ్లపై పశువులు వదిలితే కఠిన చర్యలు..
-యజమానులకు ధర్మపురి సీఐ హెచ్చరిక
ధర్మపురి, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: రోడ్లపై పశువులను వదిలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మపురి సీఐ ఎలపాటి రాంనర్సింహ రెడ్డి హెచ్చరించారు. యజమానులు తమ పశువులను తప్పనిసరిగా ఇంట్లోనే కట్టివేసుకోవాలని సూచించారు.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనల మేరకు సీఐ రాంనర్సింహ రెడ్డి, ఎస్సై జి. మహేష్‌తో కలిసి ధర్మపురి పట్టణంలో రోడ్లపై ఒంటరిగా తిరుగుతున్న నాలుగు ఆవులను గుర్తించి గోశాలకు తరలించారు.
ఇప్పటికే పలుమార్లు యజమానులకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొందరు నిర్లక్ష్యం చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, పశువుల సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇంతకు ముందు కూడా నిర్లక్ష్యంగా వదిలిన మూడు ఆవులను గోశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం మరలా నాలుగు ఆవులు ప్రధాన రహదారులపై తిరుగుతూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించినట్లు చెప్పారు.
సీఐ, ఎస్సై, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా చర్యలు తీసుకుని ఆ పశువులను గోశాలకు తరలించారు. సంబంధిత యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రజల ప్రాణ భద్రతకు భంగం కలిగించే విధంగా పశువులను రోడ్లపై వదిలేయడం తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించబడుతుందని తెలిపారు. ఇకపై కూడా రోడ్లపై ఒంటరిగా పశువులు కనిపిస్తే స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణ ప్రజలు, పశువుల యజమానులు పోలీసు, మున్సిపల్ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
