Day 2 | ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

Day 2 | ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
రెండో రోజూ రాజమహేంద్రవరంలో పర్యటన
గోదావరి నదీ పరివాహక ప్రాంతం పరిశీలన
పుష్కరాలలో కాలుష్య లేకుండా చూడాలని ఆదేశం
Day 2 | రాజమండ్రి, ఆంధ్రప్రభ : గోదావరి పుష్కరాలకు ముందు.. ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాజమండ్రిలో గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు కొనసాగిస్తూ, గోదావరిలో పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి బోటు ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలించారు.

వెంకటనగరం సమీపంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. అధికారులతో కలిసి నీటి శాంపిల్స్ సేకరింపజేశారు. ఆకస్మిక తనిఖీల్లో కాలుష్య నియంత్రణ నిబంధనల అమలులో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “పవిత్ర గోదావరిలో కాలుష్య వ్యర్థాలు కలవడం చాలా దారుణం. పుష్కరాల సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే పుణ్యం కాదు, రోగాలు వస్తాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏలూరులో తాగునీటి కాలుష్యంతో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ, పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమానంగా ముఖ్యమని స్పష్టం చేశారు.
“రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే. కానీ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరిదే. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై అసెంబ్లీ, కేబినెట్ సమావేశాల్లో చర్చిస్తామన్ని పవన్ కల్యాణ్ అన్నారు. తనిఖీల సందర్భంగా పర్యావరణ శాఖ బాధ్యతలపై మంత్రి కందుల దుర్గేష్‌ను ఉద్దేశించి కూడా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “పుష్కరాల రేవులను అందంగా తీర్చిదిద్దడం మాత్రమే కాదు, గోదావరిలో కాలుష్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది” అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పేపర్ మిల్ కాలుష్య సమస్యపై తాము నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించి చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించారు.
CLICK HERE TO READ MORE : AP DeputyCM | పవన్ మాటల వెనుక మర్మం ఏంటి…?
