భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం

భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం
ఆషాఢమాస సారె సమర్పణ, వేసవి రద్దీకి విస్తృత ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వేసవి కాలంలో ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, రానున్న ఆషాఢమాసంలో భారీ సంఖ్యలో సారె సమర్పణకు వచ్చే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించారు.
దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేపట్టారు.

ఇంద్రకీలాద్రి ముఖద్వారమైన దుర్గా స్నానఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు, కేశఖండనశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షెడ్లు, భక్తులు సేదతీరేందుకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ టికెట్ కొనుగోలు యంత్రాన్ని పరిశీలించి సేవలను వేగవంతం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
శ్రీ కనకదుర్గ నగర్లో ప్రసాదాల కౌంటర్ల సమీపంలో ఎండ వేడిమి నుంచి భక్తులను రక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న షెడ్ల పనులను పరిశీలించారు. సురక్షిత త్రాగునీటి ప్లాంట్ వద్ద మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఘాట్ రోడ్డులోని ఆన్లైన్ సేవా కేంద్రం, దర్శనం క్యూ లైన్ల మార్పులు, లగేజ్ స్టాండ్లు, చెప్పుల నిల్వ కేంద్రాల పరిస్థితిని కూడా సమీక్షించారు. వాహనాల పార్కింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన చైర్మన్, ఈవో భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
క్యూ లైన్ మార్గం ద్వారా ప్రధాన ఆలయం వరకు వెళ్లిన అధికారులు భక్తులకు అందిస్తున్న త్రాగునీరు, ఫ్యాన్ సౌకర్యాలను పరిశీలించారు. మరుగుదొడ్ల శుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. శివాలయం వైపు ర్యాంప్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి పలు సాంకేతిక సూచనలు చేశారు.
కొత్త అన్నదానం భవనం, కొత్త లడ్డూ పోటు నిర్మాణ పనులను పరిశీలించిన చైర్మన్, ఈవో నిర్మాణాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రమాదేవి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
