పాలమూరు ప్రాజెక్టులపై కీలక ప్రకటన…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

మంగళవారం ఉదయం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పంప్ హౌస్, ప్యాకేజీ–3 ప్రాంతాల్లో జరుగుతున్న పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. సమస్యల పరిష్కారం, అవాంతరాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.