Heatwave Precautions | 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

Heatwave Precautions | 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

Heatwave Precautions | కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
రేపు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక
వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
కొన్ని జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాల అవకాశం

Heatwave Precautions | అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. సోమవారం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. సూర్యోదయం నాటికే తీవ్ర వేడితో కూడిన వాతావరణంతో ఆరంభమై.. గంట గంటకూ సెగ తీవ్రత పెరిగింది. 11 గంటల నాటికి 45 డిగ్రీలకు చేరింది. ఈ తీవ్రత శనివారం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.

కంకిపాడు, పెనమలూరులో అత్యధికంగా 48.1 డిగ్రీలు

కృష్ణాజిల్లా కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో సోమవారం అత్యధికంగా 48.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. 14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 46.3 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 46.1, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 45.7, ప్రకాశం జిల్లా కొప్పెరపాడు 45.4, కోనసీమ జిల్లా శివల, కాకినాడ జిల్లా కాజులూరులో 45.2, గుంటూరు జిల్లా మంగళగిరిలో 44.9, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.7, విశాఖ జిల్లా ములగాడ 44.4, తూర్పుగోదావరి జిల్లా పోతవరం 44.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రేపు 26 మండలాల్లో తీవ్ర, 137 మండలాల్లో వడగాల్పులు

ఈనెల 26న 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ఈనెల 27న 70 మండలాల్లో తీవ్ర, 176 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 – 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి జల్లులు

మరోవైపు ద్రోణి ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Leave a Reply