వేసవి వేడి.. రెండు కుటుంబాల్లో విషాదం
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో వడదెబ్బ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందిన విషాదకర ఘటన సోమవారం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా కాలనీకి చెందిన భోగి మంగ (65) కూలి పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా తీవ్ర ఎండ ప్రభావానికి గురైంది. ఇంటికి చేరుకున్న అనంతరం ఆమె ఆరోగ్యం విషమించి మృతి చెందింది. వడదెబ్బ కారణంగానే ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అలాగే దమ్మపేట మండలంలోని చలమప్పగూడెం గ్రామానికి చెందిన బండారి నాగలక్ష్మి (48) తన భర్తతో కలిసి పొలం పనులకు వెళ్లింది. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తీవ్ర వేడి కారణంగా అస్వస్థతకు గురైంది. వాంతులు కావడంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది.
పూర్తి డీహైడ్రేషన్‌కు గురైన నాగలక్ష్మిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
