ధాన్యం నాణ్యతపై రాజీ లేదు..

ధాన్యం నాణ్యతపై రాజీ లేదు..

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

నాగర్‌కర్నూల్, మే 23 (ఆంధ్రప్రభ):నాగర్‌కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ రైస్ మిల్లు, మేడిపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా వరి ధాన్యం నిల్వ సామర్థ్యం, కొనుగోలు ప్రక్రియలను కలెక్టర్ పరిశీలించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎలా నిల్వ చేస్తున్నారో, గిడ్డంగుల సామర్థ్యం ఎంత ఉందో, ధాన్యం నాణ్యత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రైస్ మిల్లు సామర్థ్యం 8,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం నిల్వ చేసేందుకు అనుకూలంగా ఉందని, ప్రతిరోజూ సీఎంఆర్ రైస్ మూడు ఏసీకేలు ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందని సివిల్ సప్లై అధికారి కలెక్టర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు సరైన విలువ దక్కేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి, తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి పారదర్శకంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ధాన్యం అమ్మకానికి వచ్చే రైతులకు తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వరి ధాన్యం రాశులను పరిశీలించిన కలెక్టర్, ధాన్యం తడవకుండా మరియు నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నిల్వ గిడ్డంగుల పరిశుభ్రత, రక్షణ చర్యలు, రవాణా సౌకర్యాలపై కూడా సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని వేగంగా మిల్లింగ్ ప్రక్రియకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మిల్లర్లకు సూచించారు.

రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకుని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.

జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అమరేందర్, సివిల్ సప్లై అధికారి నరసింహారావు, డీఎం సివిల్ సప్లై రాజేందర్, వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, రైస్ మిల్ నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply