భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
కిష్టప్పపేటలో ‘వన్ మంత్ – వన్ కాన్స్టిట్యూయెన్సీ – ఫోర్ విజిట్స్’ ప్రారంభం
శ్రీకాకుళం, మే 23 (ఆంధ్రప్రభ): శ్రీకాకుళం మండలం కిష్టప్పపేట గ్రామంలో శనివారం నిర్వహించిన ‘వన్ మంత్ – వన్ కాన్స్టిట్యూయెన్సీ – ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమైన ఎమ్మెల్యే భూ సమస్యలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే సమస్యలు, భూ రికార్డుల సవరణ వంటి అంశాలను అధికారులు ప్రత్యేక దృష్టితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గ్రామ ప్రజల సహకారంతో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
