ఆగని అక్రమ నిర్మాణాలు

ఆగని అక్రమ నిర్మాణాలు
ప్రజల ప్రాణాలతో ఆటలు ఇక ఆపరా..?
- ఆగని నెహ్రూనగర్ అక్రమ నిర్మాణం
- కార్పొరేషన్ నిబంధనలను బేఖాతర్
- అక్రమ నిర్మాణాలపై చర్యల పేరుతో కాలయాపన
- నోటీసులు ఇచ్చినా ఆగని పనులు
- అధికారుల వైఖరిపై అనుమానాలు
- ప్రమాద హెచ్చరికలను పట్టించుకోని యాజమాన్యం
- నెహ్రూనగర్ ప్రజల్లో పెరుగుతున్న భయం
- నగరంలో చట్టాల అమలుపై ప్రశ్నలు
- నెహ్రూనగర్ వివాదస్పద నిర్మాణంపై రాష్ట్ర విజిలెన్స్ ఆరా ?
- వరుస కథనాలపై స్పందించకపోవడంపై విమర్శలు
- రాష్ట్ర పురపాలకశాఖ విభాగంకు ఫిర్యాదు ?
ఖమ్మం, మే 22 (ఆంధ్రప్రభ): ప్రజల ప్రాణాలతో ఆటలను ఇక ఆపరా అంటూ నెహ్రూనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవట్లేదని దీని వెనుక మర్మం ఏమిటి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఓ వైపు ప్రజల సంక్షేమమే ముఖ్యం అని ప్రకటనలు చేస్తుంటే ప్రజల ప్రాణాలతో కొందరు బడాబాబులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలతో ఆటలు ఆడుతుంటే పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల కోసమే ఉందని యంత్రాంగం ప్రజాసంక్షేమం కోసమే పని చేస్తుందనే భావనకు భంగం వాటిల్లే అవకాశాలు కేవలం ఒక అక్రమ నిర్మాణ కట్టడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని తేటతెల్లంగా స్పష్టం అవుతున్నా చర్యలు తీసుకోకపోవటంపై ప్రభుత్వం యంత్రాంగంపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ప్రస్తుతం నెహ్రూనగర్‌లో వివాద నిర్మాణం వల్ల వస్తున్నాయని నగరంలోని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు.
ఖమ్మం నెహ్రూనగర్‌లో జరుగుతున్న బహుళ అంతస్తుల నిర్మాణం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా పనులు సాగుతున్నాయని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. అయినా ఆగని అక్రమ నిర్మాణాలు అంటూ నెహ్రూనగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం కఠిన చర్యలకు వెనుకాడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నిర్మాణం ప్రతి రోజూ మరింత ఎత్తుకు చేరుతుండగా అధికారులు కేవలం నోటీ-సులతో సరిపెడుతున్నారు. ఇది అధికారుల వైఫల్యమా లేక కావాలనే నిర్లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు మాత్రం అధికారుల మౌనంపై మండిపడుతున్నారు.
ప్రజల ప్రాణాలతో ఆటలు :
ఈ నిర్మాణంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. సెట్‌బ్యాక్ లేకపోవడంతో అగ్నిమాపక వాహనాలు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉందంటు-న్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించడం కష్టమవుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనల నుంచి అధికారులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారో ఇప్పటికీ స్పష్టత లేదు. యాజమాన్యం మాత్రం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపార ప్రయోజనాలు సాధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నిబంధనలు కేవలం పేదలకేనా? :
సామాన్య ప్రజలు చిన్న ఇంటి నిర్మాణంలో చిన్న పొరపాటు- చేసినా అధికారులు వెంటనే స్పందిస్తారు. కానీ భారీ కమర్షియల్ భవనాల విషయంలో మాత్రం అదే కఠినత్వం కనిపించడం లేదు. డబ్బున్నవారికి చట్టాలు వేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినా జరిమానా కడితే సరిపోతుందనే ధోరణి పెరుగుతోందంటు-న్నారు. ఈ తీరుతో నగరంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. టౌన్‌ప్లానింగ్ విభాగం విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ముడుపుల మర్మం? :
నిర్మాణంలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నప్పటికీ పనులు ఆగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పెద్దగా స్పందించలేదని చెబుతున్నారు. దీనిపై ముడుపుల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే యాజమాన్యం కూడా అధికారులను లెక్క చేయడం లేదని స్థానికులు అంటు-న్నారు. అవసరమైతే జరిమానాలు కడతామంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు ఎప్పుడూ? :
ఇప్పటి-కై-నా అధికారులు మేల్కొని అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు పాటించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన నిర్మాణాలను సహించరాదని చెబుతున్నారు. ఖమ్మం నగర అభివృద్ధి పేరుతో అక్రమాలకు తావివ్వకూడదని సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ వ్యవహారంపై సమీక్ష చేయాలని కోరుతున్నారు. చట్టాలు అందరికీ సమానంగా అమలు కావాలనే అభిప్రాయం
వ్యక్తమవుతోంది. లేకపోతే నగర ప్రజల్లో అధికార వ్యవస్థపై నమ్మకం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నగరపాలక సంస్థ నిబంధనలను బేఖాతర్ :
ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ నెహ్రూనగర్‌లో జరగుతున్న అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులను గతంలో ఆదేశాలు జారీ చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు బిల్డింగ్ యజమానికి నామమాత్రం నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన సమయంలో భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. అనంతరం రెండవ నోటీస్ ఇస్తారు. దీనికి సంబంధించి సైతం బిల్డింగ్ యజమాని కార్పొరేషన్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యెడల కార్పొరేషన్ అధికారులు ఫైనల్‌గా అక్రమ నిర్మాణాలను తొలగించి వేసే ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ సమయంలో బిల్డింగ్ యజమాని నోటీసులు ఇచ్చిన కాలంలో భవన నిర్మాణం వద్ద నిర్మాణాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. వీటన్నింటిని తుంగలో తొక్కి బిల్డింగ్ యజమాని యధేచ్ఛగా భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా కార్పొరేషన్ నోటీసులకు విలువ ఇవ్వకుండా నిబంధనలను బేఖాతర్ చేస్తున్నాడని ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు ఎందుకు ఉదాసీనత చూపిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలోని నెహ్రూనగర్ ప్రాంతం పర్యవేక్షించే అధికారుల పనితీరుపై విమర్శలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెహ్రూనగర్ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని నగరపాలక సంస్థలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అధికార యంత్రాంగం ప్రతిష్టకు కొందరు కింది స్థాయి అధికారుల వలన చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
