may24Sunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

may24Sunday2026 | కరువు నేల గుండెల్లో దాగిన బంగారం కథ
may24Sunday2026 | బ్రిటిష్ కాలంలో సందడిగా మారిన రామగిరి
మూతపడిన గనులు… చావని ఆశలు
జొన్నగిరి ప్రాజెక్ట్‌తో మళ్లీ చర్చల్లోకి రామగిరి
ఉపాధి, పరిశ్రమలకు బంగారు బాట పడుతుందా?
అభివృద్ధితో పాటు పర్యావరణ ఆందోళనలు
రాయలసీమ కళ్లల్లో మళ్లీ మెరుస్తున్న బంగారు కలలు

రాయలసీమలో వేసవి ఎండలు ఎలా మండిపోతాయో…
అక్కడి ప్రజల జీవితాలూ కూడా అంతే కఠినంగా సాగిపోతుంటాయి.
ఉదయం అయ్యే సరికి పొలాల దారిలో పచ్చని పంటపొలాల చల్లని గాలుల బదులు దుమ్ము..ధూళి కనిపిస్తుంది… సాయంత్రం అయ్యే సరికి ఊరి బస్టాండ్ దగ్గర వలస బాట పట్టే యువకులే కనిపిస్తారు. “ఇక్కడ పని లేదు బాబూ…” అని హైదరాబాద్, బెంగళూరు దారులు పట్టిన కుటుంబాలు ఈ నేలలో ఎన్నో.
కానీ…
ఈ కరువు నేల గుండెల్లో తరతరాలుగా ఒక రహస్యం దాగి ఉందని పెద్దలు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. ఆ రహస్యమే బంగారం…అవును…పెద్దలు చెప్పిందీ ఇదే…“ఈ మట్టిలో బంగారం ఉంది…” అని.
నాటి పెద్దల మాట ఇప్పుడు మళ్లీ రాయలసీమ అంతా వినిపిస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పేరు మరోసారి చర్చల్లోకి వచ్చింది. కారణం… కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్. అక్కడ గోల్డ్ మైనింగ్ పనులు వేగంగా సాగుతుండటంతో… “రామగిరిలో కూడా మళ్లీ బంగారం తవ్వకాల రోజులు వస్తాయా?” అన్న ఆశలు స్థానికుల్లో మళ్లీ వేళ్ళూనుకుంటున్నాయి.
ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో రామగిరి పేరు బంగారు గనులతో మార్మోగేది. భూమి అడుగున సొరంగాలు తవ్వుతూ బంగారం వెలికి తీసే కార్మికుల అడుగుల శబ్దాలతో ఆ ప్రాంతం సందడిగా ఉండేదని పెద్దలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అప్పట్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా కార్మికులు వచ్చి ఇక్కడే జీవనం సాగించేవారు. రహదారులు వచ్చాయి… కార్మిక కాలనీలు ఏర్పడ్డాయి… విద్యుత్ వెలుగులు ప్రసరించాయి…రామగిరి అంటే అప్పట్లో ఒక చిన్న పరిశ్రమల పట్టణంలా రూపుదిద్దుకుంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కొంత కాలం తర్వాత ఆ సందడి తగ్గిపోయింది. అయినా ఆశ పూర్తిగా చావలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మళ్లీ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1984 ప్రాంతంలో పనులు ఊపందుకున్నాయి. 2001 వరకు వివిధ దశల్లో తవ్వకాలు సాగాయి. కానీ గనుల తవ్వకాలు అంత తేలికైన పని కాదు. లోతుకు వెళ్లేకొద్దీ ఖర్చులు పెరిగాయి. భారీ యంత్రాలు, సాంకేతిక సమస్యలు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల మార్పులు… చివరకు గనుల పనులను నిలిపివేశాయి.
అక్కడి నుంచి రామగిరిలో మళ్లీ నిశ్శబ్దం.
కానీ ఇప్పుడు…జొన్నగిరి మళ్లీ ఆ ఆశలను రేపుతోంది.
భూగర్భ సర్వేల ప్రకారం రామగిరి ప్రాంతంలో ఇంకా గణనీయమైన స్థాయిలో బంగారం నిల్వలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో తవ్వకాలు కేవలం 300 మీటర్ల లోతు వరకు మాత్రమే జరిగాయని… ఈసారి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇంకా లోతుగా వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు హెలికాప్టర్ సర్వేలు నిర్వహించడం… రామగిరితో పాటు రొద్దం మండలం బక్సాంపల్లి, కదిరి మండలం జౌవకల ప్రాంతాల్లో కూడా బంగారం నిక్షేపాల ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం రావడం… ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. రాష్ట్ర సహజ ఖనిజ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం ఆసక్తి రేకెత్తించింది.
ఇప్పుడు రామగిరి ప్రజలు ఒకటే ఆశతో ఎదురుచూస్తున్నారు.
“మళ్లీ గనులు మొదలైతే… మా పిల్లలు వలసలు వెళ్లక్కర్లేదేమో…” అని.
ఎందుకంటే గోల్డ్ మైన్స్ అంటే కేవలం బంగారం కాదు…
ఉపాధి. రోడ్లు. పరిశ్రమలు. కొత్త జీవితం. గనులు మళ్లీ తెరుచుకుంటే రవాణా, నిర్మాణం, యంత్రాల నిర్వహణ, భద్రత వంటి రంగాల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. కరువు, వలసలతో అలసిపోయిన రాయలసీమకు ఇది నిజంగానే బంగారు బాట కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే మరోవైపు ఆందోళనలు కూడా ఉన్నాయి. భూగర్భ తవ్వకాల వల్ల నీటి వనరులపై ప్రభావం పడొచ్చని… రసాయనాల వినియోగం వల్ల కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
రామగిరి గుట్టల కింద నిజంగానే ఎంత బంగారం దాగి ఉందో కాలమే చెప్పాలి…
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఏళ్లుగా కరువుతో ఎండిపోయిన రాయలసీమ కళ్లల్లో…
ఇప్పుడు మళ్లీ బంగారు కలలు మెరుస్తున్నాయి.

కె. ప్రసాద్, బ్యూరో ఇంచార్జ్,
ఆంధ్రప్రభ, శ్రీ సత్య సాయి జిల్లా
click here for more sunday magazines

పాలనానుభవం
మృగరాజు సింహం అడవికి తరచూ వచ్చే కరువులు, కార్చిచ్చుల వంటి విపత్తులను ముందే పసిగట్టే నక్కను ప్రధానమంత్రిగా; ఎగిరి, దూరం నుండి శత్రువుల కదలికలను గమనించే డేగనురక్షణ మంత్రిగా; విపత్తుల నుండి ఎలా తప్పుకోవాలో ఉపాయాలు తెలిసిన ఏనుగునుపర్యవేక్షకుడిగా పెట్టుకుని అద్భుతంగా పాలన సాగించేది.
సింహం పాలనలో అడవి జీవుల జీవితం చాలా కాలం పాటు ప్రశాంతంగా గడిచింది. అయితే, ఎలాంటి హడావుడి లేని ఆ ప్రశాంత జీవితానికి విసుగెత్తిన పశుపక్ష్యాదులు… కేవలం చూపులకు అందంగా ఉందని నెమలినిరాజుగా ఎన్నుకున్నాయి.
రాజుగా మారగానే నెమలి తన మంత్రివర్గాన్ని కూడా మార్చేసింది. సమర్థులైన నక్క, ఏనుగు, డేగలను పదవుల నుండి తొలగించి… తనలాగే అందంగా ఉండే చిలుకను, హంసను, జింకను మంత్రులుగా నియమించుకుంది.
ఆ కొత్త మంత్రివర్గం రోజూ అడవిలో అందాల ప్రదర్శనలు, పాటల కచేరీలతోనే కాలక్షేపం చేయసాగింది. దాంతో పరిపాలన గాలికి కొట్టుకుపోయింది.
ఎల్లకాలం ఒకేలా గడవదు కదా! కొన్నాళ్లకు అడవిలో ఒక్కసారిగా కార్చిచ్చు రగులుకుంది. చెట్లు తగలబడిపోతున్నాయి, దట్టమైన పొగ కమ్మేస్తోంది. భయపడిపోయిన జంతువులన్నీ నెమలి రాజు దగ్గరకు పరిగెత్తాయి.
“రాజా! అడవి తగలబడిపోతోంది, మమ్మల్ని కాపాడండి!” అని మొరపెట్టుకున్నాయి.
కానీ, పాలనా అనుభవం లేని నెమలికి ఏం చేయాలో పాలుపోలేదు. భయంతో తన పించాన్ని ముడుచుకుని ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. ప్రజా రక్షణ కంటే ముందు తన ప్రాణాలు రక్షించుకోవడం ఎలా అనే ఆందోళన దానిలో మొదలైంది. ఇక అందమైన చిలుకలు, హంసలు ప్రాణాలు దక్కించుకోవడానికి ఎటుపడితే అటు ఎగిరిపోయాయి. అప్పుడు అర్థమైంది… బాహ్య సౌందర్యం ఆపదను ఆపలేదని!
జంతువులకు త్వరగానే తమ తప్పు తెలిసివచ్చింది. అవన్నీ పరుగు పరుగున వెళ్లి గుహలో విశ్రాంతి తీసుకుంటున్న పాత రాజు సింహాన్ని శరణు కోరాయి. సింహం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది.
వెంటనే తన పాత మంత్రివర్గాన్ని పిలిచింది. డేగ పైకెగిరి ఎటువైపు మంటలు తక్కువగా ఉన్నాయో దారి చూపించింది. నక్క చాకచక్యంగా జంతువులన్నింటినీ సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఏనుగుల సైన్యం నది నుండి నీటిని తెచ్చి మంటలను అదుపు చేసింది.
‘బ్రతుకు జీవుడా’ అంటూ ప్రాణాలతో బయటపడ్డ జంతువులన్నీ… మళ్లీ సింహాన్నే సింహాసనంపై కూర్చోబెట్టాయి.
కర్తవ్య నిర్వహణకు, సుపరిపాలనకు కావాల్సింది ‘బాహ్య సౌందర్యం’ కాదు… ‘సమర్థతతో కూడిన అనుభవం’.
=============================

ఒక్క అవకాశం
సార్..ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్..బ్రతకడం కష్టంగా ఉంది..” అని అడిగేవాళ్ళు చుట్టూ కనిపిస్తూ ఉంటారు. తీరా అవకాశం ఇచ్చాక వాళ్లు అలాగే అణిగి మణిగి ఉంటారా అంటే సందేహమే .
ఇలాగే ఎప్పటినుండో బ్రతిమాలుతున్న ఒక కుర్రాన్ని నేను పనిలో పెట్టుకున్నాను. ఇంజనీరింగ్ చదువుకున్న అతను అంతకు ముందు కూలిపనులు చేసే వాడు అంట. జాలిపడి నా దగ్గర పెట్టుకున్నాను. కొన్నాళ్ళు చాలా సిన్సియర్ గా పని చేసాడు.ఆ తర్వాత నెమ్మదిగా పక్క చూపులు చూడసాగాడు. కొన్నాళ్ల తర్వాత నేను మానేస్తున్నాను సార్ అని చల్లగా చెప్పాడు. అదేంట్రా ఎలా బతుకుతావు అంటే మీదగ్గర మానేసి ఇక్కడే ఇంకో సెక్షన్ లో జాయిన్ అవుతున్నా అని చెప్పాడు.
ఎందుకు అని అడిగితే డబ్బులు ఎక్కువ ఇస్తారు అక్కడ అని చెప్పాడు. సరే అని చెప్పి పంపేసాను. కొన్నాళ్ల తర్వాత అక్కడి నుండి ఇంకో దగ్గరకు మారాడు. ఆ తర్వాత మా ఆఫీసు రిఫరెన్స్ ద్వారా బయట ప్రైవేట్ కంపెనీ లో మంచి పేకేజ్ కి జాయిన్ అయ్యాడు. లేటెస్ట్ బైక్ కొని దాని మీద ఒక సారి వచ్చి నన్ను కలిసి నా ఆశీర్వాదం తీసుకున్నాడు మొదట్లో ఒక దారి చూపినందుకు. మనసులో సంతోష పడ్డాను. నేను అతనికి ఒక్క అవకాశం ఇస్తే అతను పది అవకాశాలు సృష్టించుకున్నాడు. కూలీ స్థాయి నుండి టెక్కీ స్థాయికి ఎదిగాడు. మీరు కూడా అతన్ని అభినందించండి ఫ్రెండ్స్ !!!!
+++++++++++++++++++++++++++++++++++++++++++++

రంగస్థలంపై తెలుగు కథ, తెలుగు సాహిత్యం( సంక్షిప్త పరిశీలన)
సారాంశం(ABSTRACT) మరియు పరిచయం(Introduction)
Adaptance is intelligence అంటాడు Albert Einstein. వస్తువు అయినా, వ్యక్తి అయినా, ఒక కళారూపం అయినా అప్పటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే అది కనుమరుగవుతుంది. Kodak Camera లా. Antique peace గా మారిపోతాం. తెలుగు సాంఘిక నాటకం ప్రజలకు దూరం అయిపోయింది. ప్రేక్షకులను బ్రతిమాలుకుని, భోజనాలు పెట్టి కొత్త అల్లుడు మర్యాదలు చేస్తేనే గానీ ప్రేక్షకులు రావడం లేదు. ఏదో అడపా దడప అద్భుతాలు కుదరవు. ప్రజలు తెలుగు నాటకాన్ని ఎప్పుడో లైట్ గా తీసుకున్నారు, ఇంకా తీసుకుంటున్నారు. ఇది చేదు నిజం. మరి ఏమిటి పరిష్కారం?!
పరిష్కారం :
పరిష్కారం పరిచయ వాక్యంలా, ఒక గీత, ఒక దారి అలా ఉండదు. దానికి ప్రకృతి పదికి పైగా దారులు మన ముందు పెడుతుంది. మనం మేధోమథనం చేసి సరైన దారులు ఎంచుకోవాలి. నాటకం, ప్రదర్శనా పరమైనది. ఇది చాక్షుషక్రతువు అన్నారు పెద్దలు. ప్రదర్శనతో పాటు, ఆ నాటకంలో ఉన్న కథ, ఇతివృత్తం అప్పటి ప్రజల సమస్యలు, బాధలు అనురాగాలు, అంత:చేతన రహస్యాలు…., కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అనే భావం, రసం…, ఆ నాటకంలో ఉన్నాయా లేవా, ఆ. నటులు, దర్శకుడు, టెక్నీషియన్స్ దానిని సమర్ధవంతంగా వచ్చిన ప్రేక్షకులకు చెప్ప గలిగారా? నాటకం చూసిన సంతోషంతో పాటు, గుండెలనిండా గొప్ప సంతృప్తి మోసుకు వెళ్ళారా? ఇంటికి వెళ్ళాకా ఇంకో పదిమందికి చెప్పి( మంచి సినిమా చూసాకా అందరికీ చెప్పినట్టు) తమ అనుభూతి పంచుకునేలా, చర్చ చేసేలా ఆ నాటకం ఉందా? తెలుగు సాంఘిక నాటకం ఉందా? లేదా పరిషత్ లో ప్రైజులు కోసం సంకుచితంగా కుంచించుకు పోయిందా?!
వీటికి పరిష్కారం, ప్రపంచ స్థాయిని అందుకున్న మన తెలుగు సాహిత్యం పోతన, శ్రీనాధుడు, కవిత్రయం, వేమన, గురజాడ, శ్రీశ్రీ, చలం, ముద్దు కృష్ణ, మన కాళోజీ, ఇంకా ఎందరో కథా, నవలా రచయితలు.
రంగస్థలంపై తెలుగు కథ, తెలుగు సాహిత్యం, అంటే కథ, కథానిక, కవిత్వం, నవల,…ఎందుకు ఉండాలి? ఉంటే మన తెలుగు సాంఘిక నాటకానికి సాహిత్య గౌరవం దక్కి ఉండేది. దానితో పాటు ప్రేక్షకులకు, ప్రజలకు మరింత చేరువ అయ్యేది. ప్రజలు నాటకాన్ని గౌరవించేవారు. ప్రేమించేవారు. ఆరాధించేవారు. మమేక మయ్యేరు. ఇప్పటిలా ప్రేక్షకులను బ్రతిమాలుడుకుని ఆడిటోరియంలకు, లేదా పరిషత్ వేదికలకు అతిథి మర్యాదలు చేసి పిలిపించుకునే అవసరం వచ్చేది కాదు. తెలుగు సాహిత్యాన్ని, కథలను నాటకాలుగా మలుద్దాం, మా భూములు మాకే అని మరల పడ్డ రాగమా, తిరగ బడ్డ గానమా …అని గద్దర్ పాడినట్టు, ప్రేక్షక ప్రవాహం తెలుగు నాటకం వైపు గోదావరి వరదలా ప్రవహిస్తుంది! ఇది నా ఊహాత్మక ప్రతిపాదన కాదు. వాస్తవ ప్రతిపాదన. దర్శకురాలు నస్రీన్ ఇది తన పాకుడు రాళ్ళు (రావూరి భరద్వాజ) నాటకం ద్వారా నిరూపించింది. నాతో వచ్చి, కలిసి ఈ నాటకం చూసిన శ్రీ చిన వీరభద్రుడు ఈ విషయం తన వ్యాసంలో ఆశ్చర్యంతో ప్రస్తావించారు. ఈ నాటకం టిక్కెట్ ఖరీదు 300 రూపాయలు పెట్టారు. టికెట్స్ అయ్యిపోయి రెండు రోజులు హౌస్ ఫుల్ బోర్డు పెట్టారు హైదరాబాద్ నగరం రంగభూమిలో.
విమర్శలు వచ్చినా చలం మైదానం నాటకం కూడా విజయం సాధించింది.
ప్రతీ నాటకంలో కథ ఉంటుంది కదా, ప్రతీ పద్య నాటకం, జానపద నాటకం, తోలుబొమ్మలాట, ఒగ్గుకథ, సాంఘిక నాటకం, లేదా సాంఘిక నాటిక(నిడివి తక్కువ ఉన్న నాటకం) అన్నిటిలో కథ ఉంటుంది. మళ్ళీ రంగస్థలంపై తెలుగు కథ అని ఉపన్యాసం ఏమిటి అని మీకు సందేహం రావొచ్చు. వచ్చిందా? వాటికి సమాధానం మీకు పైన కొంతవరకు ఇచ్చాను.
మన తెలుగు నేలపై, కవిత్వం, కథ (గాలివాన కథకు అంతర్జాతీయ బహుమతి వచ్చింది), నవల, మళ్ళీ కవిత్వంలో వచన కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద, దళిత వాద, ప్రాంతీయ వాద, మాండలికాల కథలు, కవిత్వం….అన్నీ అంతర్జాతీయ స్థాయిలో వెలువడ్డాయి.
కానీ తెలుగు సాంఘిక నాటకం మాత్రం చాలా వెనుక బడింది. సాహిత్య గౌరవం పొందలేదు. గౌరవం మాట దేవుడు ఎరుక, పరిషత్ చట్రంలో ఇరుక్కుని, ఇరికించి మూస ధోరణిలో ప్రేక్షకుల సహనంతో ఆడుకున్నారు. దయచేసి ఆలోచించండి. ఇది ఎంతో బాధతో చెబుతున్న మాట.
సాహిత్యంలో ఓనమాలు తెలీని వారు కూడా నాటకం రాసేయడం, వేసేయడం, వందల ప్రైజులు కొట్టేయడం, వంద ప్రదర్శనలు పైగా తిప్పడం! అదే గొప్ప కథ అని ప్రేక్షకుల మీద రుద్దడం!!! రుద్దేయడం! దేశంలో తెలుగు వారు ఉన్న చాలా చోట్ల నాసిరకం, మూస ధోరణి కష్టాల కథలతో తెలుగు పరిషత్ నాటక ప్రదర్శనలు తిరిగి తెలుగు నాటకం పరువు తీసేశారు అని ఎన్నో విమర్శలు వచ్చాయి ! (దీనికి ఎన్నో రుజువులు ఉన్నాయి. మా నాటకం ఎన్నో పరిషత్ లలో ప్రైజులు కొట్టింది అని కొలబద్ద చూపుతారు). తెలుగు సాహిత్యం, తెలుగు కథ గొడ్డు పోయిందా?! అని పరభాషా ప్రముఖులు అనుకోకూడదు. ఇప్పటి వరకు జరిగింది ఎంత? ఇక ఏం చేస్తే బాగుంటుంది, ఆ ప్రయత్నాలపై కొంత చర్చ నా ఉపన్యాసం, ఈ పాత్ర సమర్పణ ద్వారా జరగాలి అని నా కోరిక.
ఎన్నో విమర్శలు. నాటక కథా సప్తాహం, అప్పా జోస్యులు వారు కొన్ని ప్రయత్నాలు చేశారు. నా M.Phil topic కూడా adaptation between story to Drama. దానికి Case study గా కాళీపట్నం రామారావు గారి కథలు నాటకీకరణం మీద పరిశోధన చేశా. నాకు గురువు గా, నన్ను గైడ్ చేస్తూ ఆ దిశగా నడిపించింది శ్రీ కోట్ల హనుమంత రావుగారు. శ్రీ DSN మూర్తి గారు ఎన్నో విషయాలు తెలియడానికి దారి చూపారు. నేను కాళీపట్నం రామారావు గారి, యజ్ఞం, చావు, భయం అనే కథలు మీద పరిశోధన చేశా..
రంగస్థలం పై తెలుగు కథ, తెలుగు సాహిత్యం ఎంత ప్రభావం చూపింది! గొప్ప కథలు, గొప్ప నాటకంగా అయ్యాయా ?! ప్రేక్షకులు సంతృప్తి చెందారా? రావూరి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు గొప్పగా ఆకర్షించినా, అదే దర్శకురాలు మహాకవి చలం మైదానం విషయంలో ఎందుకు విమర్శలు ఎదుర్కొంది? అది వేరే చర్చ. గురజాడ దిద్దుబాటు, భండారు అచ్చమాంబ తొలి కథా రచయిత్రి, ధన త్రయోదశి కథ,
ఇంకా లోతైన ఎన్నో ప్రశ్నలకు, ప్రయాణాలకు మనం సమాధానాలు వెతికి, తెలుగు కథను సాహిత్యాన్ని, తెలుగు రంగస్థలంపై, తెలుగు సాంఘిక నాటకం కలిసి అడుగులు వేసేలా చేద్దాం. చేయాలి. ముందు సాహిత్యాన్ని నేటి నాటక దర్శకులు చదవాలి.
ఇక గత చరిత్ర ఒక్కసారి చూద్దాం :
1.తెలుగు కథ, 2.అవిర్భావం, వికాసం,3. రంగస్థలం ఒక సమాహార కళ, 3. తెలుగు కథలను రంగస్థలంపై ఇంతవరకు ఎవరు ఆవిష్కరించారు, ఆ ప్రయత్నాలు, 4. రంగస్థలంపై విజయవంతమైన తెలుగు కథల ప్రదర్శనలు, 5. విద్యారంగంలో కథా నాటకాల ప్రాముఖ్యత లేదా తెలుగు సాహిత్య నాటకాల ప్రాముఖ్యత, ప్రయోజనం! ఈ ఐదు అంశాలపై లోతైన చర్చ జరగాలి.
నేను సమయాభావం వల్ల ఇందులో నాలుగు, ఐదు అంశాలపై కొంత దృష్టి సారిస్తాను!
ఉన్నవ లక్ష్మీ నారాయణ రచించిన ‘మాలపల్లి’ నవలను నగ్నముని నాటకీకరించగా ఎ.ఆర్.కృష్ణ గారి దర్శకత్వంలో ఏకకాలంగా 12 రంగస్థలాలపై ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. 1973 లో జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు నవలను సుప్రసిద్ధ నాటక రచయిత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు నాటకీకరించగా ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో గొప్పగా ప్రదర్శించారు. నాటకీకరణ చేయబడిన తొలి కథగా యజ్ఞం నిలిచి పోయింది, రచయిత కాళీపట్నం రామారావు, దర్శకుడు డి. యస్. ఎన్.మూర్తి. రసరంజని సంస్థ రంగస్థలంపై తెలుగు కథ అనే శీర్షికతో 1997 మార్చి 27 నుండి వారం రోజులు పాటు కథా నాటక సప్తాహాన్ని నిర్వహించారు. కలుపు మొక్కలు, దేవుణ్ణి చూసినవాడు, చావు, చివరి గుడిసె, సారాంశం, పతితులు, ప్రముఖుల కథలు నాటకాలుగా పడ్డాయి.
ఒక ప్రయత్నం విజయం సాధించడంతో, రసరంజని మల్లీవ్ 1998 సెప్టెంబర్ 21 నుండి తొమ్మిది రోజులు కథా నాటక శరన్నవరాత్రులు పేరుతో నిర్వహించారు. గోడలు, కార్యాశురుడు, టార్చిలైట్, తీర్పు, నా బిడ్డను కాపాడండి, అంబల బండ, ఎండమావులు, ఆమె త్యాగం, ఇలాంటి తవ్వాయి వస్తే మొదలైన ప్రముఖుల కథలు నాటకాలుగా పడ్డాయి.
అలాగే అప్పా జోస్యుల, విష్ణుభొట్ల ఫౌండేషన్ సంస్థ, 2001, 2007 లలో, మొదటి భీమవరం, తర్వాత చీరాలలో కథా నాటికల పోటీలు నిర్వహించి గొప్ప ప్రయత్నాలు చేశారు.
అలాగే, సి.ఎస్. రావు రచించిన , గుమ్మడి గింజలు కథను ఎ.ఆర్.కృష్ణ పేవ్మెంట్ మీద బతుకులు పేరుతో నాటకీరించి ప్రదర్శించారు. అదే రచయిత ఊరుమ్మడి బతుకులు, ప్రాణం ఖరీదు కథలు కూడా నాటకీకరణ చేయబడ్డాయి. యండమూరి, కథలు, ఆయన స్వయంగా నాటకాలు కూడా రాశారు.
పూర్తి డీటైల్స్ లోకి నేను వెళ్ళడం లేదు, ” ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళు ఉందో తారీఖులు దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్ర కర్ధం! ” మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తు చేసుకుందాం!
ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కాన్పించని గొప్ప కథలు, ప్రజల కోసం సృష్టి చేయబడ్డ ఎంతో సాహిత్యం తెలుగులో ఉంది. సత్తా ఉంటే మీరే గొప్పగా రాసి ప్రదర్శించండి.
లేదంటే ప్రపంచ స్థాయిని ఆల్రెడీ అందుకున్న మన తెలుగు కథ, మన తెలుగు సాహిత్యంవైపు కళ్ళు తిప్పండి. ముందు అధ్యయనం. చేయండి. తర్వాత అభ్యుదయం వైపు అడుగులు పడతాయి.
మీకు నచ్చిన కథ, మీకు నచ్చిన కవిత, లేదా ఆ కథలో ఒక అంశం, మీకు నచ్చిన గొప్ప తెలుగు నవల, లేదా మీకు నచ్చిన గొప్ప పాట కాదేదీ నాటకానికి అనర్హం, శాస్త్రం అర్థం చేసుకుని ప్రేక్షకులను మెప్పించేలా ప్రదర్శన చేస్తే! ఆట, మాట, పాట అన్నీ కలిసి, ఆ కథను నాటకంగా ప్రేక్షకుల దగ్గరకు కదిలించాలి!
తెలుగు కథ, నవలతో పాటు ఇతర ప్రక్రియలను రంగస్థలానికి మలుచుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు లాంటి వాళ్ళు చెప్పిన మాటలు నిజం.
మళ్ళీ ప్రేక్షకులు తెలుగు సాంఘిక నాటకాన్ని గౌరవంతో, ఆరాధనతో చూసే రోజులు రావాలి. ప్రతాప రుద్రీయం ట్రాయాలజీ తో శ్రీ కోట్ల హనుమంతరావు గారు ప్రదర్శనా పరమైన గొప్ప ప్రయత్నాలు చేశారు. ఖర్చుకి వెనుకాడలేదు. శ్రీ హనుమంతరావుగారు రవీంద్ర భారతి లాంటి పెద్ద ఆడిటోరియంకు పెద్ద ఎత్తులో ప్రేక్షకులను రప్పించారు. అది ఆ దర్శకుడు సత్తా, పైగా తీసుకున్న అంశం కూడా అంత గొప్పది. ప్రదర్శనా పరమైన తొలి సంచలన ప్రయోగం. దీనిని ప్రేరణగా తీసుకుని, పేరెన్నిక గల గొప్ప తెలుగు కథలను రంగస్థలంపై కి తీసుకు వస్తే, ఆ ప్రక్రియ మార్పుకు తగిన గౌరవం ఇస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
నాటక కథ ప్రజా పక్షం అయితే, కథలు గొప్పగా ఉంటే ఆ నాటకాన్ని ప్రజలు ప్రేమించి అక్కున చేర్చుకుంటారు. రంగస్థలం పై తెలుగు కథ, తెలుగు సాహిత్యం కనిపించాలి, వినిపించాలి.
++++++++++++++++++++++++++++++++++++++

తిరుమలక్షేత్రంలో బందీగా భక్తాగ్రేసరుడు
భక్తాగ్రేసరుడైన హనుమంతుడు తిరుమలక్షేత్రంలో అరుదైన రీతిలో తిరుమలేశుని ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం వెనుక ఉన్న మందిరంలో సంకెళ్లతో బంధించిన చేతులను జోడించిన భంగిమ లో బేడీ ఆంజనేయ స్వామిగా కొలువై పూజలందుకుంటున్నాడు.
వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడికి జన్మనిచ్చిన అంజనాదేవి సహజ సిద్దమైన బాల్య చాపల్యంతో హనుమంతుడు చేస్తున్న అల్లరి భరించలేక ఆయన చేతులకు సంకెళ్లు వేసి ఒక చోట కూర్చో పెట్టి తాను తిరిగి వచ్చే వరకు కదలకూడదని చెప్పి వెళ్లిందని, అందుకు సాక్ష్యంగానే హనుమంతుడు బేడీ (సంకెళ్లు ధరించిన) ఆంజనేయస్వామిగా దర్శన మిస్తున్నారని స్థల పురాణం చెబుతోంది.
అదేవిధంగా పూరి క్షేత్రంలో కూడా జగన్నాధుడి ఆజ్ఞ మేరకు చేతులకు సంకెళ్లు ధరించిన భంగిమలో కొలువైన హనుమంతుడు దరియా మహావీర్ పేరుతో పూజలు అందుకుంటున్నారని, ఆ స్వామి ప్రతిరూపంగానే తిరుమల క్షేత్రంలో బేడీ ఆంజనేయస్వామి కొలువై ఉన్నారని మరో కధనం కూడా ప్రాచుర్యంలో ఉంది. అయితే 1843 లో తిరుమల క్షేత్ర పరిపాలనా బాధ్యతలను స్వీకరించిన మహంతుల హయాంలో పూరీ క్షేత్రం నుంచి వచ్చిన సంప్రదాయం మేరకే బేడీ ఆంజనేయస్వామి కి నిత్య పూజా కైంకర్యాల ప్రాచుర్యం మొదలైనట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. ఇతర అంశాల సంగతెలా ఉన్నా ఈ విధంగా బేడీలు ధరించి ముకుళిత హస్తుడైన హనుమంతుడు దేశంలో ఇటు తిరుమలక్షేత్రంలో అటు పూరి క్షేత్రంలో మాత్రమే భక్తులకు ఇప్పటికీ దర్శనం ఇస్తున్నారన్నది వాస్తవం.
ప్రతిరోజూ తిరుమలేశునికి నైవేద్యం సమర్పించిన తరువాత ఆలయం నుంచే తెచ్చే ప్రసాదమే బేడీ ఆంజనేయస్వామి కి కూడా నివేదించే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతినెలా పునర్వసు నక్షత్రం రోజున తిరుమలలో సీతా రామలక్ష్మణుల తిరువీధి ఊరేగింపు ఈ ఆలయం వరకు వస్తుంది. అప్పుడు సీతారామలక్ష్మణులకు హారతి ఇచ్చే అర్చకులు శేష హారతిగా బేడీ ఆంజనేయస్వామికి కూడా ఇస్తారు. రాములవారి మెడలోని పూలమాలను బేడీ ఆంజనేయస్వామికి సమర్పిస్తారు. ఇక ప్రతి ఆదివారం బేడీ ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం జరుగుతుంది. ఏటా జరిగే తిరుమల బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రులు బేడీ ఆంజనేయస్వామి మందిరం నుంచే ఊరేగింపుగా తిరుమలేశుని ఆలయానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది
ఓం నమో వెంకటేశాయ

