Telangana | చిన్నారులతో హ‌రీశ్‌, విజ‌య్ ముచ్చట

సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో పర్యటన

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సిద్దిపేట జిల్లా కొండపాకలో ఉన్న శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె వైద్యశాలను మాజీ మంత్రి హరీశ్‌రావు, ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కలిసి సందర్శించారు. ఆస్పత్రిలో పేద చిన్నారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్న గుండె చికిత్సలు, శస్త్రచికిత్సల గురించి ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించి, త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వైద్యులతో సమావేశమైన హరీశ్‌రావు, విజయ్ దేవరకొండ ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, శస్త్రచికిత్సల విధానం, ఆధునిక వైద్య సదుపాయాలు, ఇప్పటివరకు లబ్ధి పొందిన చిన్నారుల వివరాలపై చర్చించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి గుండె వైద్య సేవలు అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

చిన్నారుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో సేవా భావంతో పనిచేస్తున్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది కృషిని వారు అభినందించారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడ్డారు.