ఆర్ట్స్ సంస్థ సేవలకు కేంద్ర మంత్రి ప్రశంసలు

ఆర్ట్స్ సంస్థ సేవలకు కేంద్ర మంత్రి ప్రశంసలు
- రైతుల కోసం ‘ఏఐ’ ఆధారిత సేవా కేంద్రం, ఆగ్రో ఫ్రెష్ మార్కెట్ అవుట్‌లెట్లు ప్రారంభం
- సాంకేతికతతోనే వ్యవసాయం లాభదాయకం.. పొండూరు ఖాదీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇంచార్జి కలెక్టర్‌తో కలిసికార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి
బూర్జ (ఆమదాలవలస), ఆంధ్రప్రభ:
ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ రైతులకు అందిస్తున్న బహుముఖ సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. శుక్రవారం బూర్జ మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ సంస్థను సందర్శించిన కేంద్రమంత్రి, అక్కడి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుఅందిస్తున్న సేవలను, వ్యవసాయ ప్రాసెసింగ్ విధానాలను, రైతుల కోసం అందుబాటులో ఉంచిన ఆధునిక వ్యవసాయ పనిముట్లను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
ముఖ్యంగా రైతులకు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగే ‘సోలార్ ఎనర్జీ పంప్ సెట్ల’ వినియోగాన్ని చూసి మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రైతులు తమ సొంత విత్తనాలను ఉత్పత్తి చేసుకోవడం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవాలన్నారు. అలాగే సమూహాలుగా కలిసికట్టుగా ప్రాసెసింగ్, మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టి ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని సూచించారు. రైతు కుటుంబాల నుంచి మహిళలు కూడా ముందడుగు వేసి గ్రామీణ స్థాయిలో ఆహార ఉత్పత్తి కేంద్రాలు, చిన్న పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలని, జిల్లా అభివృద్ధిలో ఎఫ్‌పీఓలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
రైతులకు అండగా కృత్రిమ మేధస్సు కేంద్రం:
కార్యక్రమంలో భాగంగా రైతులకు సాగుపై విలువైన సలహాలు, సూచనలు అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) ఆధారిత సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన సాగు విధానాలు, ఉత్పత్తుల నాణ్యత పెంపునకు సంబంధించిన సేవలను సులభంగా పొందవచ్చని తెలిపారు. దాదాపు లక్ష మంది రైతులకు మేలు జరిగేలా ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన ఆర్ట్స్ సంస్థను, దీనికి సాంకేతిక సహకారం అందించిన ‘ఫార్మ్ విద్య’ సంస్థను మంత్రి ప్రత్యేకంగా కొనియాడారు.
అదేవిధంగా ఎఫ్‌పీఓలు తయారు చేస్తున్న నాణ్యమైన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ‘ఆగ్రో ఫ్రెష్ మార్కెట్ అవుట్‌లెట్లను’ ప్రారంభించారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని, వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుతాయని స్పష్టం చేశారు. ఎఫ్‌పీఓల అభివృద్ధికి సహకరిస్తున్న నాబార్డ్, ఎన్‌సీడీసీ సంస్థల సేవలను కూడా ఈ సందర్భంగా ప్రశంసించారు.
పొండూరు ఖాదీ నియోజకవర్గానికే గర్వకారణం:
ఈ పర్యటనలో భాగంగా ‘సిక్కోలు వీవర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ’ ఉత్పత్తులను మంత్రి సందర్శించారు. పత్తి పండించడం దగ్గర నుండి రాట్నం, మగ్గం ఉత్పత్తుల తయారీ వరకు జరుగుతున్న మొత్తం ప్రక్రియను, నూతన డిజైన్ల అభివృద్ధిని పరిశీలించారు. జియో ట్యాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మార్కెట్ పరిధిని మరింత విస్తరించి చేనేత యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పొండూరు ఖాదీ తమ నియోజకవర్గంలో ఉండటం గర్వకారణమని, దాని అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తామని రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ హామీ ఇచ్చారు.
రైతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సాహంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఆర్ట్స్ సంస్థ డైరెక్టర్ నూక సన్యాసిరావు మరియు వారి సిబ్బంది చేస్తున్న కృషిని అభినందిస్తూ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం/శ్రీకాకుళం ఇంచార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహ్మద్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, ఏపీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణమూర్తి నాయుడు, మాజీ జడ్పీటీసీ ఏ. రామకృష్ణలతో పాటు పలువురు ఉన్నతాధికారులు, కూటమి నాయకులు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
