Key Suggestions | వ‌డ‌దెబ్బ‌కు ఇప్ప‌టికే 22 మంది మృతి

Key Suggestions | వ‌డ‌దెబ్బ‌కు ఇప్ప‌టికే 22 మంది మృతి

అస్వ‌స్థ‌త‌కు గురైన వంద‌లాది మంది
మ‌రో రెండు రోజులు వ‌డ‌గాల్పులే
ప‌గ‌టి పూట బ‌య‌ట‌కు రావ‌ద్ద‌న్న అధికారులు

Key Suggestions | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి. రికార్డు ఉష్ణోగ్రతలతో పలు ప్రాంతాలు ఉడుకుతున్నాయి. ప్రభుత్వం పెరుగుతున్న ఎండల తీవ్రత వేళ అప్రమత్తం చేస్తోంది. కీలక సూచనలు చేసింది. మరో వారం వరకు ఇదే విధంగా ప్రచండంగా ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాల్పులతో వడదెబ్బ కారణంగా ఒకే రోజు 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పులకొలిమిలా మారింది. భూపాలపల్లిలో వడదెబ్బతో ఒక్కరోజే నలుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. రేగొండ మండలం భాగిర్తిపేటకు చెందిన యాకూబ్‌(45), మొగుళ్లపల్లి మండలం పోతుగల్లుకు చెందిన సక్కమ్మ(59), చిట్యాల మండలం చల్లగరిగేకు చెందిన పోషయ్య, కాటారం మండలం శంకరంపల్లికి చెందిన సమ్మక్క(65) వడదెబ్బ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 22 మంది వడదెబ్బతో మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తొమ్మిది మంది వడదెబ్బ బారినపడి మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు..
అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఉదయం సమయంలోనే ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు. . ఈ రోజు.. రేపు పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్​ జారీ చేసింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాలు లు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో మూడు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకేసారి 20 జిల్లాల్లో 46 డిగ్రీలను దాటాయి. సూర్యాపేట జిల్లాలో 29 మండలాల్లో వడగాలులు వీచాయి. భానుడి ప్రతాపానికి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.
తెలంగాణకు పొడిగాలులు
కాగా, మ‌హారాష్ట్ర, రాజస్థాన్‌ నుంచి తెలంగాణకు పొడిగాలులు వస్తుండటంతో గాలిలో తేమ పడిపోయి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొంది. గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌ జిల్లాల్లో భరించలేని విధంగా వాతావరణం మారుతోంది. శుక్ర, శని వారాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత వడగాల్పుల తీవ్రత వేళ అందరూ అప్రమత్ తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నందు వల్ల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టణాల్లో చ‌లివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వీలైనంత వరకు మ‌ధ్యాహ్నం ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు రేవంత్ రెడ్డి సూచించారు. అధికారులు అందుబాటులో ఉండాలని అప్రమత్తం చేసారు.

ప‌గ‌టి పూట బ‌య‌ట‌కు రావ‌ద్దు..
భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నాయి. తీవ్రమైన ఎండలతో చిన్నపిల్లలు, వృద్ధులు, బయట పనులు చేసే కార్మికులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరమని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply