ఖాకీ చాటుకున్న కరుణ: ఆపదలో ఆదుకున్న హసన్‌పర్తి సీఐ మహేందర్

ఖాకీ చాటుకున్న కరుణ: ఆపదలో ఆదుకున్న హసన్‌పర్తి సీఐ మహేందర్

చక్రంలో ఇరుక్కున్న చీర.. ప్రాణాపాయంలో దంపతులు.. స్వయంగా ఆసుపత్రికి తరలించిన వైనం

హన్మకొండ క్రైమ్, ఆంధ్ర ప్రభ : గుంటూరుపల్లి గ్రామపంచాయతీలో రైతులతో నిర్వహించిన సమావేశాన్ని ముగించుకుని హసన్‌పర్తి సీఐ మహేందర్ తిరిగి వస్తుండగా ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) సమీపంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఏనుమాముల మార్కెట్‌కు వెళ్లి మిర్చి తీసుకుని ఎక్సెల్ ద్విచక్రవాహనంపై గుంటూరుపల్లికి తిరిగి పయనం అయిన మడిపల్లి పద్మ, వెంకటస్వామి దంపతులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. బండి పై వెళ్తున్న సమయంలో పద్మ కట్టుకున్న చీర అకస్మాత్తుగా వెనుక చక్రంలో ఇరుక్కుపోవడంతో అదుపుతప్పిన వాహనం నుంచి దంపతులిద్దరూ ఒక్కసారిగా రోడ్డుపై కిందపడిపోయి గాయపడ్డారు.

సరిగ్గా అదే దారిలో వెళ్తున్న సీఐ మహేందర్ విలవిల్లాడుతున్న దంపతులను గమనించి క్షణం కూడా ఆలోచించకుండా తక్షణమే స్పందించారు. రోడ్డుపై ఉన్న క్షతగాత్రులను వెంటనే స్వయంగా తన పోలీసు వాహనంలోకి ఎక్కించుకుని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా హసన్‌పర్తి ఆసుపత్రికి తరలించి వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా చూశారు. నిత్యం నేరస్తుల భరతం పట్టే కఠినమైన ఖాకీ దుస్తుల వెనుక దాగి ఉన్న అంతులేని మానవత్వాన్ని, సామాజిక బాధ్యతను కళ్లకు కట్టిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతగా నిలిచిన పోలీసుల సమయస్ఫూర్తిని, సేవాతత్పరతను చూసి యువతతో పాటు వృద్ధులు సైతం సలాం చేస్తున్నారు.

Leave a Reply