భక్తిశ్రద్ధలతో మెట్లు పూజ..

భక్తిశ్రద్ధలతో మెట్లు పూజ..

-ఇటీవల జరిగిన సంఘటనలతో మరమ్మత్తులు..
-యుద్ధ ప్రాతిపదికన మెట్ల మార్గం మరమ్మతులు పూర్తి
-ఇంద్రకీలాద్రిపై భక్తులకు తిరిగి అందుబాటులోకి..
-మరమ్మతులు వేగంగా పూర్తి చేసిన ఇంజనీరింగ్ విభాగం
-శుక్రవారం భక్తిశ్రద్ధలతో మెట్ల పూజలు నిర్వహించిన భక్తులు
-సుందరంగా మారిన మెట్ల మార్గం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ:

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన మెట్ల మార్గం మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. ఇటీవల మెట్లు మార్గంలో స్లాబ్ పెచ్చుల్లు బాలికపై పడి గాయాలైన సంఘటనతో ఇంజనీరింగ్ విభాగం అధికారులు వేగంగా స్పందించి పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఇటీవల మెట్ల మార్గంలో తలెత్తిన చిన్నపాటి సమస్యలను గుర్తించిన ఈఓ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

దీంతో సీలింగ్ మరమ్మతులు, పాతబడిన పెయింటింగ్‌లకు కొత్త రంగులు వేయడం, మార్గాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం వంటి పనులను తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. శుక్రవారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. నూతనంగా రూపుదిద్దుకున్న మెట్ల మార్గంలో భక్తులు ప్రశాంత వాతావరణంలో మెట్ల పూజలు నిర్వహించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.

మెట్ల మార్గం తిరిగి అందుబాటులోకి రావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. “భక్తుల ఇబ్బందులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం అభినందనీయం” అంటూ ఈఓ సీనానాయక్‌, ఇంజనీరింగ్ అధికారుల సమన్వయ కృషిని ప్రశంసించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆలయ వర్గాలు తెలిపాయి.

Leave a Reply