అన్న క్యాంటీన్ల వద్ద వీఎంసీ ‘నీడ’ చర్యలు

అన్న క్యాంటీన్ల వద్ద వీఎంసీ ‘నీడ’ చర్యలు
- మండుతున్న ఎండల్లో ప్రజలకు ఉపశమనం..
- 11 అన్న క్యాంటీన్ల ముందు తాత్కాలిక షెడ్లు..
- క్యూలైన్లలో నిలబడే వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు..
- త్రాగునీటి సరఫరా పెంపుతో దాహార్తికి చెక్..
- హీట్‌వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ హెచ్చరిక
ఆంధ్రప్రభ, విజయవాడ (కార్పొరేషన్) : నగరాన్ని ఉక్కపోత ఎండలు ఉడికిస్తున్న వేళ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది. నగర పరిధిలోని అన్న క్యాంటీన్ల వద్ద భోజనం కోసం వచ్చే ప్రజలు మండుటెండలో ఇబ్బందులు పడకుండా ప్రత్యేక నీడ ఏర్పాట్లు చేపట్టి ఉపశమనం కల్పించింది. ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో వీఎంసీ అధికారులు అప్రమత్తమై నగరంలోని 11 అన్న క్యాంటీన్ల ముందు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో కార్మికులు, నిరుపేదలు, వృద్ధులు, రోజువారీ కూలీలు అధిక సంఖ్యలో క్యాంటీన్లకు తరలివస్తుండటంతో క్యూలైన్లలో నిలబడే సమయంలో ఎండ తాకిడి తీవ్రంగా ఉండకుండా ఈ చర్యలు చేపట్టారు. ఎండ వేడి కారణంగా ప్రజలు అస్వస్థతకు గురికాకుండా త్రాగునీటి సరఫరాను కూడా పెంచారు. క్యాంటీన్ల వద్ద చల్లని తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఎండల సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వీఎంసీ వర్గాలు వెల్లడించాయి.

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్ ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని, తరచూ నీరు తీసుకోవాలని, చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ప్రజలకు తక్కువ ధరలో ఆహారం అందించే అన్న క్యాంటీన్లు ఇప్పుడు ఎండల సమయంలో రక్షణ కవచంలా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాసేవకు ప్రాధాన్యం ఇస్తూ వీఎంసీ చేపట్టిన ఈ చర్యలకు నగరవాసుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

