పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని సూచన..

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాళేశ్వరంలోని మెగా విశ్రాంతి భవనంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా విక్రయించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు తక్షణ చెల్లింపులు జరిగేలా ఆన్లైన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని, ఎక్కడా అవకతవకలకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి హెచ్చరించారు. ఆర్డీవో పర్యవేక్షణలో కొనుగోళ్లు నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాటారం ఆర్డీవో రవీందర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
