పుష్ప రాజులకు జైలు శిక్ష

పుష్ప రాజులకు జైలు శిక్ష

  • ఎర్రచందనం స్మగ్లర్లకు జైలు శిక్ష
  • తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు కీలక తీర్పు
  • రెండేళ్ల కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా
  • అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లకు తిరుపతి జిల్లా ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు రెండేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. 2014 సంవత్సరంలో యర్రావారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి రవాణా చేస్తున్న నిందితులను అప్పటి ఎస్ఐ రహీముల్లా, సిబ్బంది అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి ఇద్దరు నిందితులపై నేరం రుజువైందని తేల్చి శిక్ష విధించారు.

ఈ కేసులో శిక్ష పడిన నిందితులు యర్రావారిపాలెం మండలం పి. వడ్డిపల్లి చెందిన ఎస్. చలపతి (57), యర్రావారిపాలెం మండలం ఓఎస్ గొల్లపల్లి గ్రామం బి. సుబ్రహ్మణ్యం (33)గా పోలీసులు తెలిపారు. నిందితులు కోర్టుకు గైర్హాజరు కావడంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ కాగా, అనంతరం వారు కోర్టులో లొంగిపోయారని వెల్లడించారు. “గుడ్ ట్రయల్ మానిటరింగ్” వ్యవస్థ ద్వారా కేసును పటిష్టంగా నడిపించడంతో నేరం రుజువై ఈ తీర్పు వెలువడిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ తీర్పు చట్టాన్ని ఉల్లంఘించే వారికి గుణపాఠం అన్నారు. జిల్లాలో అటవీ సంపదను రక్షించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై మా ఉక్కుపాదం నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు, పర్యవేక్షణ, కోర్టు లైజనింగ్‌లో కృషి చేసిన చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమర నారాయణ, అప్పటి ఎస్ఐ రహీముల్లా, భాకరాపేట సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్ఐ బీవీ లోకేష్, హెడ్ కానిస్టేబుల్ హరినాథ్, కోర్టు కానిస్టేబుల్ శివలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply