భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి

భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి
- టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎస్.కిరణ్
ఊట్కూర్, ఆంధ్రప్రభ:
ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఎస్.కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్లలో భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ, కార్మికులతో కలిసి ఈ నెల 25న చేపట్టనున్న “చలో హైదరాబాద్” కార్యక్రమ గోడపత్రికలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్.కిరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ కార్మికులకు పూర్తి స్థాయిలో ఫలితాలు అందడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ బీఓసీ కార్డులు లేవని, కార్డు తీసుకున్న కార్మికులు కూడా రెన్యూవల్స్ చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్డు ఉండి రెన్యూవల్ అయిన కార్మికులకు కూడా క్లెయిమ్స్ సరిగ్గా అందడం లేదని, ఏ రకంగా చూసినా నిరక్షరాస్యులైన భవన నిర్మాణ కార్మికులకు సరళతరంగా లబ్ధి చేకూరడం లేదన్నారు. అరవై సంవత్సరాల తర్వాత భవన నిర్మాణ కార్మికుడి శ్రమ లేబర్ ఉపయోగానికి రావడం లేదని, కార్మికుడిగా నెలకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి పన్నెండు రూపాయలు చెల్లిస్తున్నా పెన్షన్ సౌకర్యం అందడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు తమ వాగ్దానాల్లో భాగంగా సహజంగానే పెన్షన్లు ప్రకటిస్తున్నప్పటికీ, కార్మికుడిగా నమోదు చేసుకున్న వారికి మాత్రం పెన్షన్లు ప్రకటించడానికి వెనుకాడుతున్నాయని విమర్శించారు. చలిలో వణుకుతూ, వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, ఆరుగాలం కష్టపడి ప్రాజెక్టులు, బిల్డింగ్లు, సెక్రటేరియట్ వంటి నిర్మాణాలు చేస్తూ జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న కార్మికులకు పెన్షన్ చెల్లించకపోవడం అన్యాయమన్నారు. 60 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 9,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రైవేటు ఏజెన్సీల రెన్యూవల్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలతో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను రద్దు చేసి ఈఎస్‌ఐ (ESI) ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే సహజ మరణానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, పెండింగ్ క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రీలు కోల కృష్ణయ్య, చిన్న బాలు, కురుమయ్య, కొత్త గుడిసె నరసింహులు, కొల్లంపల్లి హనుమంతు, పాపల్లి అంజప్ప, వడ్డే అశోక్, బాలకృష్ణ, సుండు కురుమప్ప, బుర్ర అంజప్ప, సుండు హనుమంతు, సందప్ప, నరసింహ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
