BeHonest | ఉద్యోగం రావడం విజయమైతే…

BeHonest | ఉద్యోగం రావడం విజయమైతే…

BeHonest | గౌరవాన్ని నిలబెట్టుకోవడం జీవిత సార్థకత
కుటుంబాల కలగా ప్రభుత్వ ఉద్యోగం
ఉద్యోగం వెనుక ఉన్న త్యాగాలు
అవినీతి ఆరోపణలు కలిగిస్తున్న ఆందోళన
డబ్బు ఆశతో మసకబారుతున్న గౌరవం
ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత ఏమిటి?
నిజాయితీనే శాశ్వత గుర్తింపు
ప్రతి ఉద్యోగికి ఈ ఘటన ఒక హెచ్చరిక

BeHonest | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ప్రభుత్వ ఉద్యోగం…
చాలామందికి అది కేవలం జీతం వచ్చే పని కాదు. ఒక కుటుంబం ఎన్నేళ్లుగా కంటున్న కల.
తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం. “మా బిడ్డ ఉద్యోగి అయ్యాడు” అని గర్వంగా చెప్పుకునే క్షణం కోసం ఎన్నో ఇళ్లు ఆశగా ఎదురుచూస్తుంటాయి. ఒక ఉద్యోగం వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి…
ఎన్నో విఫలయత్నాలు ఉంటాయి…పుస్తకాల మధ్య గడిచిన యవ్వనం ఉంటుంది…స్నేహితుల సరదాలు వదిలేసుకుని చదివిన రోజులు ఉంటాయి…తల్లిదండ్రులు తమ అవసరాలు మానుకుని పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుకున్న ఆశలు ఉంటాయి.

అలాంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎవరికైనా నిజంగా గొప్ప విజయమే.
కానీ… ఆ ఉద్యోగంతో వచ్చిన గౌరవాన్ని జీవితాంతం కాపాడుకోవడం అనేది మాత్రం ఇంకా గొప్ప విషయం.

ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి.
బాధ్యతాయుతంగా మెలుగుతూ, ఉద్యోగాన్ని పవిత్రంగా, పనినే దైవంగా భావిస్తూ, ప్రజలకు న్యాయం చేయాల్సిన స్థానాల్లో ఉన్న కొందరు… అత్యాశతో పట్టుబడుతూ, అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం బాధ కలిగిస్తోంది. తాజాగా ఓ మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఘటన కూడా అలాంటి చర్చకే దారితీసింది.

ఆ వార్త చదివినప్పుడు చాలా మంది మనసులో ఒక్క ప్రశ్న తప్పక తలెత్తుతుంది.

ఆ ఉద్యోగం రావడం కోసం ఆమె ఎంత కష్టపడి ఉంటుంది..?
ఎన్ని పరీక్షలు రాసి ఉంటుంది..?
ఎన్ని కలలు కని యూనిఫామ్ ధరించి ఉంటుంది..?
ఆమెను చూసి కుటుంబం ఎంత గర్వపడి ఉంటుంది..?

కానీ… కొన్ని క్షణాల డబ్బు ఆశ…
ఎన్నేళ్ల శ్రమను, ఒక కుటుంబ గౌరవాన్ని, సమాజంలో సంపాదించిన విలువను ఒక్కసారిగా మసక బార్చేసింది.

BeHonest
BeHonest

డబ్బు మళ్లీ సంపాదించవచ్చు. జీవితంలో మరో అవకాశం రావచ్చు.
కానీ ఒకసారి మనిషిపై నమ్మకం దెబ్బ తింటే… ఆ గౌరవాన్ని తిరిగి పొందడం చాలా కష్టం.
ప్రత్యేకంగా తల్లిదండ్రుల కళ్లలో కనిపించే నిరాశ… కుటుంబం ఎదుర్కొనే అవమానం… అవి మాటల్లో చెప్పలేనివి.

ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం అధికారం కాదు… అది బాధ్యత.
ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన వృత్తి.
ఒక నిజాయితీ గల ఉద్యోగి వందల మందికి ఆదర్శంగా నిలుస్తారు
అదే ఒక అవినీతి ఘటన… మొత్తం వ్యవస్థపైనే ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

ఈ సంఘటన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక హెచ్చరిక లాంటిది.
ఉద్యోగం సాధించడానికి ఎంత కష్టపడతారో… ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి అంతకంటే ఎక్కువ జాగ్రత్త అవసరం.

ఎందుకంటే చివరికి ప్రజలు గుర్తుంచుకునేది హోదాను కాదు…
మనిషి నిజాయితీని.

click here to read 8 ఫైర్ ఇంజిన్లతో…

click here to read more

Leave a Reply