మద్దిమడుగులో భారీ అగ్నిప్రమాదం

మద్దిమడుగులో భారీ అగ్నిప్రమాదం

  • అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో ఐదు షాపులు దగ్ధం..
  • లక్షల్లో ఆస్తి నష్టం

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; నాగర్‌కర్నూల్ జిల్లా, పదర మండలం, మద్దిమడుగు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆలయ పరిసరాల్లో ఉన్న ఐదు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో వ్యాపారులకు లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో ఒక షాపులో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న పూజా సామగ్రి, కొబ్బరికాయలు, ప్రసాదం విక్రయించే ఇతర దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. అర్ధరాత్రి కావడం, మంటల తీవ్రత అధికంగా ఉండటంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చూస్తుండగానే ఐదు షాపులు సామాగ్రితో సహా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దుకాణాల్లో నిల్వ ఉంచిన నగదు, విలువైన పూజా సామగ్రి, ఫర్నిచర్ తదితర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బాధిత పేద వ్యాపార కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఆలయ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం, దేవస్థానం కమిటీ స్పందించి తక్షణ సాయం అందించి తమను ఆదుకోవాలని బాధిత వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply