అంతమ్మగూడెం పరిశ్రమల కాలుష్యంపై సమగ్ర విచారణ జరపాలి

అంతమ్మగూడెం పరిశ్రమల కాలుష్యంపై సమగ్ర విచారణ జరపాలి
- కాలుష్య విముక్తి పోరాట సమితి డిమాండ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మ గూడెం గ్రామ పరిసరాల్లో ఉన్న పరిశ్రమలు తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని, దీనిపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి జాయింట్ కమిటీ విచారణలో బాధిత గ్రామస్థులకు, ఫిర్యాదుదారులకు భాగస్వామ్యం కల్పించాలని ‘అంతమ్మ గూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి’ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం వారు చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పోరాట సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. అంతమ్మ గూడెం పరిసర పరిశ్రమల కాలుష్యంపై గ్రామస్థులు చేసిన ఫిర్యాదుల మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ కోసం 12 మంది సభ్యులతో కూడిన జిల్లా స్థాయి జాయింట్ కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈ కమిటీ నిర్వహించే క్షేత్రస్థాయి విచారణలో కింది అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు.
కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు ఫిర్యాదు చేసిన రైతులందరి వ్యవసాయ క్షేత్రాలను, బోరుబావులను కమిటీ సభ్యులు స్వయంగా పరిశీలించాలని, పరిశ్రమల నుండి వస్తున్న విపరీతమైన దుర్వాసనల వల్ల గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వారి అభ్యంతరాలను నివేదికలో నమోదు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గతంలో పరిశ్రమలకు అనుకూలంగా తప్పుడు నివేదికలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని, ఈసారి పరిశ్రమల లోపల తనిఖీలు నిర్వహించే సమయంలో ఫిర్యాదుదారుల ప్రతినిధులను కూడా లోపలికి అనుమతించి పారదర్శకంగా వ్యవహరించాలని వారు కోరారు.
పరిశ్రమల సమీపంలో మూసి నీటి ద్వారా వరి పంట పండుతున్న వ్యవసాయ భూముల్లోని బోరుబావుల నీటి నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించాలని, పరిశ్రమల ఆవరణలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు నిర్మాణాలపై క్షుణ్ణంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, జిల్లా స్థాయి జాయింట్ కమిటీ చేపట్టబోయే తనిఖీలు, క్షేత్రస్థాయి పరిశీలనలు, నివేదికల రూపకల్పనలో కాలుష్య బాధితులమైన ‘అంతమ్మ గూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి’ ప్రతినిధులకు తగిన అవకాశం కల్పించి, తమ గ్రామానికి కాలుష్య రహిత వాతావరణం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాలుష్య విముక్తి పోరాట సమితి ప్రతినిధులు వస్పరి ప్రభ, రావుల ధనలక్ష్మి, రేణుక, బుచ్చమ్మ, ముత్తమ్మ, రామ్ రెడ్డి, బాల్ రెడ్డి, మహేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
