రైతులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ బన్సీలాల్

రైతులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ బన్సీలాల్

-నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక అవగాహన సదస్సు

చెన్నూర్, ఆంధ్రప్రభ:
చెన్నూర్ నియోజకవర్గ రైతులు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ సూచించారు. నియోజకవర్గ పరిధిలో నకిలీ, అనధికారిక పత్తి విత్తనాల రవాణా, నిల్వ, అమ్మకం, కొనుగోళ్లను అరికట్టడంలో భాగంగా వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కిష్టంపేట్ గ్రామంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల నుంచే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ, అనధికారిక విత్తనాల వాడకం వల్ల దిగుబడులు తగ్గిపోవడంతో పాటు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవడం, ప్యాకెట్‌పై కంపెనీ పేరు, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించడం తప్పనిసరి అని వివరించారు.

అనుమానాస్పదంగా విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప వ్యవసాయ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనధికారికంగా పత్తి విత్తనాలను నిల్వ చేయడం, రవాణా చేయడం, అమ్మకం నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply