డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఆపరేషన్

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఆపరేషన్

  • జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

గద్వాల (ప్రతినిధి), ఆంధ్రప్రభ:
జోగులాంబ గద్వాల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు తెలిపారు. యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టే డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు నార్కోటిక్ జాగిలం (స్నిఫర్ డాగ్) ‘జిమ్మీ’ సహాయంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే గద్వాల్ టౌన్, గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని భీమ్‌నగర్, చింతలపేట, గంజిపేట, దౌదర్‌పల్లి, సంగాల, జమ్మిచేడు, గుర్రంగడ్డ, జనగాంపల్లి, అనంతపురం, బసల్ చెరువు తదితర గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్ జాగిలం “జిమ్మీ” సహాయంతో అనుమానాస్పద వాహనాలు, ప్రయాణికుల బ్యాగులు, పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, ఇతర అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. యువత ఎక్కువగా సంచరించే ప్రాంతాలతో పాటు జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ఈ ఆకస్మిక చెకింగ్‌లు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాల్లో పాల్గొనే వారిని గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజల సహకారంతో గద్వాల జిల్లాను “డ్రగ్ ఫ్రీ జిల్లా”గా మార్చేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఎస్పీ వివరించారు.

Leave a Reply