రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పట్టణంలోని దర్గా ఎదురుగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏనుగు అనసూయ (63) అనే వృద్ధురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన అనసూయ తన కుమారుడు వెంకట్ రెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై చౌటుప్పల్ కు వచ్చింది. ఇద్దరూ కలిసి పనులు ముగించుకుని సొంత గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో దర్గా వద్దకు రాగానే వెనుక నుండి వేగంగా వచ్చిన మినీ డీసీఎం వాహనం వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న అనసూయ రోడ్డుపై పడిపోయింది. ఢీ కొట్టిన వాహనం ఆమె తలపై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు వెంకట్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.
అనసూయ భర్త గతంలోనే మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడికి వివాహం అయ్యింది. చిన్న కుమారుడు వెంకట్ రెడ్డికి ఇంకా వివాహం కాలేదు. అనసూయ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
