చేపల వేట కోసం..
చేపల వేట కోసం..
- రానున్న సీజన్ లో వరి సాగుపై నీలినీడలు!
- ఎండనున్న గొంతుకలు.. అల్లాడనున్న మూగజీవాలు!
- స్వార్థం కోసం అడుగంటనున్న భూగర్భజలాలు
- రాయపర్తి మండలంలో చేపల వేటగాళ్ల వికృత చర్య
- నీరులేక మారుతున్న చరిత్ర గల వనంవారి మాటు చెరువు
రాయపర్తి, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం చేపల వేట కోసం కొందరు చేసిన స్వార్థపూరిత పని స్థానిక రైతాంగాన్ని, మూగజీవాలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు ఉన్న కాస్త నీటిని మంగళవారం తెల్లవారుజాము నుండి పైపుల ద్వారా తోడేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నీరంతా వృథాగా పోవడంతో రానున్న వరి సీజన్‌కు సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోయింది.
చేపల కోసం చెరువును గుల్ల చేశారు..
రాయపర్తి మండల కేంద్రం నుంచి రాగన్నగూడెం వెళ్తుండ పెర్కవేడు రెవెన్యూ పరిధిలోని వనం వారి మాటు చెరువులో పెరిగిన చేపలను పట్టుకోవడమే లక్ష్యంగా కొందరు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా, మత్తడి పైనుండి పైపులను అమర్చి నీటినంతటినీ బయటకు తోడేశారు. నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో చేపల వేట సులువైంది కానీ, ఆ నీటిపైనే ఆధారపడ్డ వందలాది ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
వరి సాగుపై నీలినీడలు..
రానున్న వరి సీజన్ కోసం రైతులు ఇప్పుడిప్పుడే సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చెరువులో నీరు నిండుకుపోవడం పట్ల రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉన్న నీటిని ఇలా తోడేస్తే, రేపు పొలాలకు సాగునీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? పంటలు ఎలా పండుతాయి? అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూగజీవాలకు తాగునీటి కరవు..
ఈ నీటి తోడివేత ప్రభావం కేవలం వ్యవసాయంపైనే కాకుండా, స్థానిక పశుపక్షాదులపై కూడా తీవ్రంగా పడింది. ఎండ తీవ్రతకు చుట్టుపక్కల నీటి వనరులు ఎండిపోతుండగా, ఈ కుంటలోని నీరే మూగజీవాలకు ప్రధాన తాగునీటి ఆధారంగా ఉండేది. ఇప్పుడు నీరు లేకపోవడంతో పశువులు, పక్షులు దాహార్తిని తీర్చుకోవడానికి అల్లాడుతున్నాయి.
నిపుణుల హెచ్చరికల ప్రకారం.. ఒక చెరువు లేదా కుంటలోని నీటిని ఇలా అనాలోచితంగా తోడేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాల మట్టం ఘోరంగా పడిపోయే ప్రమాదం ఉంది. చెరువు చుట్టూ ఉన్న బోరుబావులు, బావుల్లో నీరు ఎండిపోయి, రానున్న రోజుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.
అధికారుల స్పందన కరవు…
ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, నీటిపారుదల లేదా మత్స్యశాఖ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ వనరులను నాశనం చేస్తూ, పర్యావరణానికి హాని కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
