అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కఠిన చర్యలు

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : గుండాల మండల పరిధిలోని కాచనపల్లి పంచాయతీ పరిధి బాటన్ననగర్ సమీపంలోని శివారు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సోమేశ్వర్ తెలిపారు.

ఈ సందర్భంగా సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. కాచనపల్లి పంచాయతీ పరిధిలోని బాటన్ననగర్ వద్ద వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రెండు ట్రాక్టర్ల ద్వారా ఇల్లందు పట్టణానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందిందన్నారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని ఆళ్లపల్లి మండల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కుంజ మధు, ట్రాక్టర్ యజమాని సంతపురి వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాను ఆసరాగా చేసుకుని రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ఇసుకను ఇల్లందు సహా పలు ప్రాంతాలకు తరలిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు.

విచారణలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు తేలడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ సోమేశ్వర్ తెలిపారు.

Leave a Reply