Child Trafficking Telangana | దత్తత పేరుతో శిశువుల అక్రమ విక్రయాలు

Child Trafficking Telangana | దత్తత పేరుతో శిశువుల అక్రమ విక్రయాలు
Child Trafficking Telangana | మెదక్ జిల్లాలో పెరుగుతున్న శిశు వ్యాపారం
పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటున్న దళారులు
ప్రైవేట్ ఆసుపత్రుల్లో అక్రమాల కలకలం
పిల్లల కొనుగోలు, అమ్మకాలు చట్టరీత్యా నేరం
Child Trafficking Telangana | మెదక్, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్రంలో శిశు విక్రయాల దందా గుట్టుగా సాగుతోంది. ఇది కొందరికి వ్యాపారంగా మారింది. దీనికోసమే కొత్తగా అవతరిస్తున్న దళారులు ఈ వ్యాపారంతో లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పేదలను టార్గెట్‌గా చేసి వారినుంచి పిల్లలను సేకరించి సంతానలేమి దంపతులకు విక్రయిస్తున్నారు. అమ్మ స్పర్శను గుర్తుపట్టే లోపే అప్పగింతలు కానిచ్చేస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
పిల్లలతో వ్యాపారం చేసే ముఠాలు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ కేంద్రాలుగా బలపడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళారులకు పలు ప్రైవేట్ ఆసుపత్రులు, పలు నర్సింగ్ హోమ్‌ల యాజమానులు సహకరిస్తున్నారు. మెదక్ జిల్లాలో వరుస శిశు విక్రయ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో మూడున్నరేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 31 శిశు విక్రయ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇందులో మొత్తం 24 మంది ఆడ బిడ్డలు, ఏడుగురు మగ శిశువుల విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఈ ఏడాదిలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఏడు సంఘటనలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. 2023లో 3 శిశు విక్రయాలు జరిగితే అందులో ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువు ఉండగా, ఒక్క సంఘటనపైనే ఎఫ్ఐఆర్ నమోదైంది. 2024లో 11 శిశు విక్రయాలు జరగగా, 9 మంది ఆడ, ఇద్దరు మగ శిశువులు ఉండగా, ఎవరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

2025లో పది శిశు విక్రయాలు జరగగా, అందులో ఏడుగురు ఆడ, ముగ్గురు మగ శిశువులు ఉండగా, మూడు కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం ఏడు శిశు విక్రయ ఘటనలు చోటుచేసుకోగా, అందులో ఆరు ఆడ, ఒక మగ శిశువు ఉండగా, మూడు కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం విశేషం.
జిల్లాలోని మెదక్, నర్సాపూర్, హవేలీఘనపూర్, నిజాంపేట్, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగ్, కొల్చారం తదితర మండలాల్లో ఎక్కువగా శిశు విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. పిల్లలు లేని నిస్సహాయ దంపతులకు దత్తత పేరిట అక్రమంగా పిల్లలను విక్రయిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. మగ శిశువుకు రూ.5 లక్షలు, ఆడ శిశువుకు రూ.3 లక్షల చొప్పున వెలకడుతూ బేరసారాలు సాగిస్తున్నారు.
అక్షరాస్యత, అవగాహన లేని, మద్యానికి బానిసలైన పేద కుటుంబాలకు ఎంతో కొంత ముట్టజెప్పి ఎక్కువ మొత్తంలో దళారులు పంచుకుంటున్నట్లు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. పలువురు దళారులు చైన్ సిస్టమ్‌గా వ్యాపారం సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలను తల్లులకు తెలియకుండా అక్రమంగా ఇతరులకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
పేదరికాన్ని ఆసరాగా చేసుకుని…
అధిక సంతానంతో పోషణ భారంగా మారిన తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును రూ.3 లక్షలకు విక్రయించిన ఘటనలో పది మందిపై మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన శిరీష-దేవిసింగ్ దంపతులకు ముగ్గురు సంతానం ఉండగా, నాలుగో ప్రసవం కోసం మార్చి 27న మెదక్ పట్టణంలోని ఎంసీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన శిరీష ఆడ శిశువుకు జన్మనిచ్చింది. నలుగురు పిల్లలను పోషించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో శిశువును విక్రయించేందుకు నిర్ణయించుకొని ఆర్మూర్‌కు చెందిన శారదను సంప్రదించారు.
కొల్చారం మండలం చిన్నఘనపూర్ తండాకు చెందిన గుగ్లోత్ సోనీ, వెల్దుర్తి మండలం మంగళపర్తికి చెందిన ధర్మసోత్ రాజు, మెదక్ మండలం సంగాయగూడ తండాకు చెందిన ఇస్లావత్ ప్రేమిలా, హవేలీఘనాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన మహేందర్, నిజామాబాద్ జిల్లా కొండాపూర్ మండలం మూడ్ మామిడిభాను తండాకు చెందిన భాస్కర్ మధ్యవర్తుల సహకారంతో సిద్దిపేట జిల్లా కొత్వాల్ మండలం అల్లీనగర్ గ్రామానికి చెందిన బొమ్మ లింగయ్య-కమలమ్మ దంపతులకు రూ.3 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు.
ఏప్రిల్ 1న మెదక్ పట్టణంలోని పిల్లికోటల్ వద్ద మధ్యవర్తుల ద్వారా విక్రయించారు. అయితే ఆర్మూర్‌కు చెందిన శారద శిశువు తల్లిదండ్రులకు కేవలం రూ.40 వేలు, మిగతా మధ్యవర్తులకు రూ.10 వేల చొప్పున ఇచ్చి మిగతావి తాను తీసుకున్నట్లు తెలిసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు వివరాలు సేకరించి శిశువును స్వాధీనం చేసుకొని సంగారెడ్డి శిశుగృహకు అప్పగించారు.
హెల్త్ కేర్ ఆసుపత్రిలో ఓ గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే.. పుట్టిన బిడ్డను అక్కడ పని చేసే నర్స్ రూ.1.50 లక్షలకు విక్రయించింది. మెదక్ పట్టణంలోని హెల్త్ కేర్ ఆసుపత్రిలో ఏప్రిల్ 12న చేరిన నస్రా ఫాతిమా అనే గర్భిణికి 13వ తేదీ ఉదయం 12 గంటలకు సిజేరియన్ చేయగా ఆడ శిశువు జన్మించింది.
అక్కడ నర్స్‌గా పనిచేసే అత్తరి బేగం ముందస్తు పథకం ప్రకారం పుట్టిన శిశువును చిన్నపిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్తున్నట్లు చెప్పి స్థానిక గోల్కొండ వీధికి చెందిన నౌసిన్ ఉన్నిసా (నిలోఫర్) అనే వ్యక్తి సహకారంతో సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్, నదీయా సుల్తానా దంపతులకు రూ.1,50,000లకు విక్రయించారు.
అలా వచ్చిన డబ్బులో నుంచి మధ్యవర్తిగా ఉన్న నౌసిన్ ఉన్నిసా (నిలోఫర్)కు రూ.10 వేలు ఇచ్చి మిగతా రూ.1,40,000 తాను తీసుకున్నట్లు తెలిసింది. ప్రసవంలో బిడ్డ చనిపోయిందని తల్లికి చెప్పి విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ వారం తర్వాత అసలు విషయం తెలియడంతో బాధిత కుటుంబం బయటకు రావడంతో బాధితులు మే 3న పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి నర్స్ అత్తరి బేగం, మధ్యవర్తి నౌసిన్ ఉన్నిసా (నిలోఫర్), శిశువును కొనుగోలు చేసిన సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్, నదీయా సుల్తానాలను అరెస్ట్ చేశారు. హవేలీ ఘనపూర్ మండలం లింగ్సాన్‌పల్లి తండాకు చెందిన మంజుల ఫిబ్రవరి 10న మెదక్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మద్యానికి బానిసైన తల్లిదండ్రులు పది రోజుల పసికందును రూ.5 లక్షలకు అమ్మేందుకు బేరం పెట్టారు.
మెదక్ పట్టణంలోని మధ్యవర్తుల సహాయంతో కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన పిల్లలు లేని రజిత-రాజు అనే దంపతులకు మార్చి 4న రూ.1.70 లక్షలకు విక్రయించారు. అంగన్‌వాడీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపి శిశువును స్వాధీనం చేసుకొని శిశుగృహకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పిల్లలను అమ్మడం.. కొనడం.. నేరం
పిల్లలను అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తామని మెదక్ జిల్లా మహిళా సంక్షేమాధికారి హేమభార్గవి తెలిపారు. పిల్లలను అమ్మిన వారు, కొన్నవారితో పాటు మధ్యవర్తులపైనా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. పిల్లల క్రయవిక్రయాలు జరిగితే పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 1091 లేదా 100కు, 1098 చైల్డ్‌లైన్ నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు.
