TIMS Hospital Hyderabad | అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్యం

TIMS Hospital Hyderabad | అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్యం

TIMS Hospital Hyderabad | అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్యం
అవయవ మార్పిడికి అత్యాధునిక సౌకర్యాలు
సిద్ధమైన టిమ్స్

TIMS Hospital Hyderabad | హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వైద్యారోగ్య శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆసుపత్రి ద్వారా అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. నిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు సనత్‌నగర్ టిమ్స్‌ను అటానమస్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు.

ఇప్పటికే భవన నిర్మాణ పనులు పూర్తికాగా, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, ఐసీయూల ఏర్పాటుతో పాటు స్కానింగ్ యంత్రాల ఏర్పాటు కూడా పూర్తి కావచ్చింది. నిమ్స్ తరహాలో టిమ్స్‌లోనే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని రకాల అవయవాల మార్పిడి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో మాత్రమే ఉన్న ఈ ఆపరేషన్లు ఇక్కడ విస్తృతంగా జరిగే అవకాశం ఉంది. ఉస్మానియా ఆసుపత్రిలో కిడ్నీ, కాలేయం మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నప్పటికీ, గాంధీలో గత కొంతకాలంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు నిలిచిపోయాయి. నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన అవయవాలు ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నాయి. టిమ్స్ ఆసుపత్రి సేవలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన జూన్ 2న అందుబాటులోకి రానున్నాయి.

అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్యం

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సనత్‌నగర్ టిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 53 ఎకరాల విస్తీర్ణం గల స్థలంలో 22.6 ఎకరాల్లో ఆసుపత్రి భవనాలు నిర్మించారు. రూ.1150 కోట్ల వ్యయంతో వెయ్యి పడకల సామర్థ్యంతో ఆసుపత్రిని నిర్మించారు. ఇందులో 37 స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేశారు. 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అవయవాల మార్పిడి కోసం 400 మంది వైద్య నిపుణులను, మరో 1400 మంది వైద్య సిబ్బందిని నియమిస్తున్నారు.

37 స్పెషాలిటీ విభాగాల్లో ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించనున్నారు. అన్ని రకాల వైద్య పరీక్షల కోసం హైఎండ్ ఎంఆర్ఐ, నాలుగు సిటీస్కాన్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ తర్వాత రోగులు కోలుకునేందుకు క్లిష్టమైన కేసుల కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బ్లాక్ (ఐసీయూ) సిద్ధం చేస్తున్నారు. సాధారణ వార్డుల్లో 500 పడకలు, ప్రైవేట్, వీఐపీ వార్డుల్లో 200 పడకలు ఏర్పాటు చేశారు. డయాగ్నోస్టిక్, ఇతర యంత్రాల ఏర్పాటు కూడా పూర్తి కావచ్చింది.

నిమ్స్ తరహాలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. న్యూమేటిక్ సూట్స్ సిస్టమ్‌లో రోగి వైద్య పరీక్ష ఫలితాలు కూడా డిజిటల్ రూపంలో అందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం లాన్ (లోకల్ ఏరియా నెట్‌వర్క్) ద్వారా ఫలితాలు వైద్యుల వద్దకు చేరుతాయి. వ్యాధి నిర్ధారణ త్వరగా జరిగి సత్వరమే వైద్య చికిత్స అందుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సహాయకుల కోసం ఆసుపత్రిలో 200 పడకల సామర్థ్యంతో ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.

జూన్ 2 నుంచే అందుబాటులోకి…

వచ్చే నెల జూన్ 2 నుంచి టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పనులు ఊపందుకున్నాయి. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మరో 15 రోజుల గడువు ఉండటంతో ఈలోగా మిగిలిన పనులను పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి Damodar Raja Narasimha ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply