ఇచ్చిన మాట ప్రకారం స్థానికులకు ఉద్యోగాలివ్వండి
ఇచ్చిన మాట ప్రకారం స్థానికులకు ఉద్యోగాలివ్వండి
- ఏడాదిగా అమలు కాని కంపెనీ హామీ
- ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై యువత ఆగ్రహం
- మోనిన్ ఇండియా పరిశ్రమ ఎదుట ధర్నా యువత ధర్నా
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంతపల్లి గ్రామానికి చెందిన యువకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు సోమవారం మోనిన్ ఇండియా పరిశ్రమ ప్రధాన గేటు ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు నిరసన కొనసాగింది. గ్రామంలోని చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికేతరులకు అవకాశాలు కల్పిస్తున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇస్తామని ఏడాది నుంచి హామీలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ధర్నా విషయం తెలుసుకున్న పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్ అనిల్ గుప్తా పోలీసులకు సమాచారం అందించగా, సీఐ, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గ్రామస్తులు, పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఐదు నెలల క్రితం ఆర్డీఓ, తహసీల్దార్ సమక్షంలో పరిశ్రమ ప్రతినిధులు గ్రామ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఒక్కరికీ కూడా ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. గ్రామంలో అర్హత కలిగిన యువత ఎక్కువమంది ఉన్నారని, వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కంపెనీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థుల అర్హతల వివరాలను గ్రామస్తులకు వెల్లడించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
యువతకు ఉద్యోగాలివ్వాల్సిందే: పడమటి అనంతిరెడ్డి, గుంతపల్లి సర్పంచ్
సర్పంచ్ అనంతిరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటుకు తాను పూర్తి సహకారం అందించానని, కంపెనీ రహదారి కోసం తన సొంత భూమిలోని 16 గుంటలు ఇచ్చినట్టు గుర్తుచేశారు. పరిశ్రమ వెనుక ఉన్న వాగులు, కాల్వలు పూర్తిగా వపూడ్చేశారని ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగాలడగడానికి వెళితే.. గతంలో 20 మంది యువతపై కేసులు నమోదు చేశారు. ఇది తీవ్ర అన్యాయం. గతంలో ఆర్డీవో, ఎమ్మార్వోతో పాటు కంపెనీ యాజమాన్యంతో కలిసి మాట్లాడితే కొన్ని రోజుల్లోనే స్థానిక యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అతీగతీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం మాట్లాడితే ఉద్యోగాలివ్వం, ఏమివ్వమని కంపెనీ యాజమాన్యం రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం తగదని సర్పంచ్ పేర్కొన్నారు.
