పెట్రోల్, డీజిల్ ధరలపై వైసీపీ సమరశంఖం

పెట్రోల్, డీజిల్ ధరలపై వైసీపీ సమరశంఖం

ధరల మంటపై విజయవాడలో భారీ నిరసన
“బాబు షూరిటీ… మోసం గ్యారంటీ” అంటూ కూటమి ప్రభుత్వంపై మల్లాది విష్ణు ధ్వజం
ఇంధన ధరలు తగ్గించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. సామాన్యులు, ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న అదనపు భారం, పెరుగుతున్న జీవన వ్యయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
వినూత్న రీతిలో ఆటోకు తాడు కట్టి తోసుకుంటూ నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

“బండి కాదు మొండి… ఇదీ సాయం పట్టండీ”, “పెట్రోల్ ధర మండుతోంది… ఎడ్లు కట్టండి” అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. “గోపాలా… గోవిందా… రావయ్యా…” అంటూ విష్ణు ఆలపించిన పాటతో కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇంధన ధరలు తగ్గిస్తామని, వ్యాట్ తగ్గిస్తామని హామీలు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు.

పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, రోడ్ డెవలప్‌మెంట్ సెస్, డీజిల్‌పై 22.25 శాతం సెస్ విధిస్తూ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించిన ఆయన, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ద్వారా కార్మికులకు భరోసా కల్పించారని గుర్తుచేశారు.

ప్రస్తుతం మాత్రం ప్రజా రవాణాను ప్రైవేట్ పరానికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర నిధులు అభివృద్ధి పేరుతో ఒకే ప్రాంతానికి కేటాయిస్తున్నారని, రైతులు, విద్యార్థులు, మహిళలు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజలపై అదనపు భారం తగ్గించేలా పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply