రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడి ఆత్మహత్య

రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడి ఆత్మహత్య

కర్నూలు, ఆంధ్రప్రభ:
కర్నూలు – దూపాడు రైల్వే స్టేషన్ల మధ్య శనివారం సాయంత్రం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కానా ఖజానా సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద ఓ గుర్తుతెలియని వృద్ధుడు రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం సాయంత్రం సుమారు 4:15 గంటల సమయంలో రైల్వే ట్రాక్ కిలోమీటర్ నంబర్ 246/16 మరియు 247/1 మధ్య ఈ దారుణం జరిగింది. సుమారు 70 సంవత్సరాల వయసు కలిగిన సదరు వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కర్నూలు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ నాగరాజు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు.. కర్నూలు రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లలిత కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

ప్రస్తుతం మృతుడికి సంబంధించిన వివరాలు ఏవీ లభించకపోవడంతో, అతని శరీర గుర్తింపు మరియు ధరించిన దుస్తుల ఆధారంగా పోలీసులు గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. మృతుడు సుమారు 5 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో, చామన ఛాయ రూపం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. వృద్ధుడికి తెల్లటి వెంట్రుకలతో పాటు బట్టతల ఉందని, ఆయన లోపల నీలం రంగు టీ-షర్ట్ ధరించి, దానిపై తెలుపు రంగు నిలువు గీతలు ఉన్న నల్లటి షర్టు వేసుకుని ఉన్నట్లు గుర్తించారు.

ఈ వృద్ధుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలిసినా, లేదా మీ ప్రాంతాల్లో ఎవరైనా వృద్ధులు కనిపించకుండా పోయి ఉంటే వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. సమాచారం ఉన్నవారు కర్నూలు రైల్వే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనాథ్ రెడ్డిని 9247575608 నెంబరులో కానీ, లేదా ఎస్సై లలితను 9247575609 మొబైల్ నెంబరులో కానీ సంప్రదించి వివరాలు అందించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply