15 Crore Meals : భళా హెచ్‌కేఎంసీఎఫ్ Andhra Prabha Spl News

15 Crore Meals : భళా హెచ్‌కేఎంసీఎఫ్ Andhra Prabha Spl News
- పేదల అక్షయ పాత్ర
- 15 కోట్ల మైలు రాయి దాటిన సేవతత్పరత
- ఆరోబిందో ఫార్మా సహకారంతో సేవా విస్తరణ
- నర్సింగిలో ఘనంగా 10వ వార్షికోత్సవ వేడుకలు
- ఆధునిక వంటశాల పరికరాల ప్రారంభం
- పేదలకు పోషకాహార భోజనాల పంపిణీ
- సేవా కార్యక్రమాలను ప్రశంసించిన జయేశ్ రంజన్
- “ఎవరూ ఆకలితో ఉండకూడదు” : సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ
- తెలంగాణ ప్రభుత్వ సహకారంపై ఫౌండేషన్ కృతజ్ఞతలు
- నాలుగు కేంద్రీకృత వంటశాలలతో విస్తృత సేవలు
ఆంధ్రప్రభ, హైదరాబాద్ (నర్సింగి)

ఆకలితో అలమటించే అన్నార్తుల క్షుద్బాధను తీర్చే క్రతువులో …
ఆరోబిందో ఫార్మా సహకారంతో 15 కోట్ల సమష్టి భోజనాల మైలురాయిని హరే కృష్ణ మూవ్ మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (HKMCF) దాటింది. లక్షలాది ప్రజలకు పోషకాహారాన్ని అందిస్తూ తన దశాబ్దకాల సేవా ప్రయాణాన్ని తన 10 వార్షికోత్సవం స్మరించుకుంది. హైదరాబాద్ నర్సింగి కేంద్రీకృత కార్యాలయంలో 10వ వార్షికోత్సవ వేడుకలలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

15 Crore Meals : ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ మెట్రోపాలిటన్ ఏరియా. అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నార్సింగిలో కేంద్రీకృత వంటశాల సేవా సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఆధునిక పరికరాలను ప్రారంభించారు. హరే కృష్ణ మూవ్ మెంట్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ సారథ్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో
ప్రత్యేక అతిథిగా ఆరోబిందో ఫార్మా డైరెక్టర్ డాక్టర్ ఎం. శివ కుమారన్, , గౌరవ అతిథులుగా జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్ బడావత్ సంతోష్, జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్ ఎన్. రవి కిరణ్, HKM చారిటబుల్ ఫౌండేషన్ CEO, కౌంతేయ దాస, పాల్గొన్నారు.
15 Crore Meals : ఈ సందర్భంగా HKMCF అంతర్గత డిజైన్ బృందం రూపొందించిన ఆటోమేటెడ్ దోసె తయారీ యంత్రం, వెసెల్ సీలింగ్ యంత్రాన్ని జయేశ్ రంజన్ ప్రారంభించారు. అనంతరం వంటశాల సిబ్బంది వలంటీర్లతో ముచ్చటించారు. సమాజ సేవలో అంకితభావాన్ని అభినందించారు.
పోషకాహార పంపిణీలో సాంకేతికత, సామర్థ్యం , కరుణను సమన్వయం చేస్తూ సమాజానికి సేవలందిస్తున్న ఫౌండేషన్ కృషిని ఆయన ప్రశంసించారు. అనంతరం హైదరాబాద్ వ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రతిరోజూ వేడి పోషకాహార భోజనాలను తీసుకెళ్లే ఆహార పంపిణీ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

15 Crore Meals : ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ. ఆరోగ్యకర కరుణతో నిండిన సమాజ నిర్మాణంలో ఆహార భద్రత, సమాజ భాగస్వామ్యం . సామాజిక బాధ్యతల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆహార సహాయ కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో భోజన సేవలు, విపత్తు సహాయ కార్యక్రమాలు నిత్యం అభాగ్యులకు భోజన పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా వేలాది మంది లబ్ధిదారులకు నిరంతరంగా సేవలందిస్తున్న ఫౌండేషన్‌ను ఆయన మెచ్చుకున్నారు. అలాగే, భవిష్యత్తులో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సర్వతోముఖ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

15 Crore Meals : ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ మాట్లాడుతూ , “శ్రీల ప్రభుపాదులు ప్రతిపాదించిన ‘మన కేంద్రానికి 10 మైళ్ల పరిధిలో ఎవరూ ఆకలితో ఉండకూడదు’ అనే దివ్య దృష్టితో ప్రేరణ పొందిన HKMCF, గత దశాబ్ద కాలంగా అవసరమైన వారికి, రోగులకు, నిరుపేదలకు పోషకాహార భోజనాలను అందించేందుకు అంకితభావంతో సేవలందిస్తోంది. 15 కోట్ల భోజనాల మైలురాయిని చేరుకోవడం మా వాలంటీర్లు, దాతలు మరియు శ్రేయోభిలాషుల నిరంతర సహకార ఫలితం. మా సేవా కార్యక్రమాలకు నిరంతర ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగి, మహబూబ్ నగర్. , శ్రీకాకుళం, కాకినాడ వంటశాలల స్థాపనకు విశేష సహకారం అందించిన ఆరోబిందో ఫార్మా కె. నిత్యానంద రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహకారం వల్ల లక్షలాది మంది లబ్ధిదారులకు చేరువ కావడం సాధ్యమైంది” అని అన్నారు.
ఆరోబిందో ఫార్మా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ , ఫౌండేషన్ డైరెక్టర్ కె. నిత్యానంద రెడ్డి మాట్లాడుతూ, , HKM చారిటబుల్ ఫౌండేషన్‌తో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యంపై గర్వంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నాలుగు కేంద్రీకృత వంటశాలల స్థాపనకు ఫౌండేషన్ అందించిన సహకారం, COVID-19 సమయంలో అందించిన అదనపు మద్దతు ద్వారా గత పది సంవత్సరాల్లో సుమారు 15 కోట్ల భోజనాలను అందించగలిగామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాంటీన్లు ఆసుపత్రి భోజన పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు HKMCF వంటి సంస్థలకు మరింత విస్తృతంగా సేవలందించేందుకు తోడ్పడినట్లు ఆయన పేర్కొన్నారు. వాలంటీర్లు భాగస్వాముల కృషిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
