పదో తరగతి టాపర్లకు ఘన సన్మానం..

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం కల్వల జడ్పీ హైస్కూల్లో ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాపర్ విద్యార్థులను మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన ప్రత్యేక కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో మండ సహస్ర 600 మార్కులకు గాను 561 మార్కులు సాధించి మొదటి స్థానం, బానోతు నవ్య 558 మార్కులతో రెండో స్థానం, భూక్య అనూష 554 మార్కులతో మూడో స్థానం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు.

ఈ ముగ్గురు విద్యార్థినులను శాలువాలు కప్పి, అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే గొప్ప ఫలితాలు సాధించగలరని ఈ విద్యార్థులు నిరూపించారు. మార్కులు మాత్రమే కాదు, క్రమశిక్షణ, విలువలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల శ్రమ కలిసొస్తేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి.

ఈ టాపర్లు ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి. ఇంకా ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని ఇంటర్, డిగ్రీ, పోటీ పరీక్షల్లో కూడా రాణించాలి. చదువు ఒక్కటే జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం. ప్రతి విద్యార్థి తమ కుటుంబానికి, గ్రామానికి గర్వకారణం కావాలి. కల్వల పాఠశాల పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలు కొనసాగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. కార్యక్రమంలో వేల్పుల సుజాత, ప్రధానోపాధ్యాయుడు బండారు నరేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply