దేశం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు..

దేశం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు..
అదానీ వ్యవహారంపై సమాధానం చెప్పాలి…
లంచ ఆరోపణలకు రాజకీయ రక్షణ ఎందుకు?..
కార్పొరేట్ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దు..
కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు ఇన్చార్జి వల్లూరు భార్గవ్..
విజయవాడ, ఆంధ్రప్రభ : దేశం అనేది ఏ ఒక్క నాయకుడి, ఏ ఒక్క కార్పొరేట్ సంస్థ వ్యక్తిగత ఆస్తి కాదని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌చార్జి వల్లూరు భార్గవ్ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయత కంటే ఏ వ్యక్తి లేదా సంస్థ పెద్దది కాదని స్పష్టం చేశారు. అదాని గ్రూపులో కు సంబంధించిన లంచాల ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సమయంలో, నిజాలను వెలికితీయాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని రక్షించేలా కనిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 140 కోట్ల భారతీయులు పెరుగుతున్న ఇంధన ధరలు, ఆర్థిక ఒత్తిళ్లు, వ్యవస్థల బలహీనతల భారాన్ని మోస్తుంటే, కొందరు ప్రభావశీలులకు ప్రత్యేక రక్షణ ఎందుకు కల్పిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం రావాలని డిమాండ్ చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీ, అదానీ గ్రూప్ మధ్య ఉన్న సంబంధాలపై వరుసగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, అయితే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనం, ఒత్తిడి రాజకీయాలు, సంస్థాగత రక్షణ వైపు మొగ్గుచూపుతోందని విమర్శించారు. దేశ ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలు ముఖ్యమనే భావన ప్రజల్లో కలిగితే ప్రజాస్వామ్యంపై నమ్మకం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఇంధన ధరలు పెరిగినప్పుడు సామాన్యుడు ఎందుకు భారాన్ని భరించాలి? ఓపెన్ మార్కెట్ విధానాల్లో జోక్యాలు ఎందుకు జరుగుతున్నాయి? జాతీయ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
రాజ్యాంగం కంటే ఎవరూ పెద్దవారు కాదని, భారత గణతంత్ర వ్యవస్థ కంటే ఏ కార్పొరేట్ సంస్థా గొప్పది కాదని వల్లూరు భార్గవ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రశ్నించే హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
