ఆదానీ, అంబానీకి అమ్ముడుపోయిన మోదీ

ఆదానీ, అంబానీకి అమ్ముడుపోయిన మోదీ
- మాయ మాటలతో ప్రజలను మోసం చేసిన ప్రధాని
- పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలి
- సీపీఐ డిమాండ్
తిరుపతి టౌన్, ఆంధ్రప్రభ : ఆదానీ, అంబానీ లాభాల కోసం పెంచి సామాన్య ప్రజలను నడ్డివిడిచి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని శనివారం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఒక మాట, ఎన్నికల ముగిశాక ఒక మాట చెప్పి సామాన్యమైన ప్రజలను మోసం చేసి, ఆదానీ, అంబానీ లాభాల కోసం విచ్చలవిడిగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
ఈ దేశంలో ప్రతిపక్షాల నోరు ఎత్తనీయకుండా దేశంలో ఉన్న ప్రజా సమస్యలను పక్కనపెట్టి, దేశ ప్రజల్లో ఉన్న సెంటిమెంటును తీసుకొని ప్రజల ఐక్యతను దెబ్బతీస్తూ, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టారని అన్నారు. కార్పొరేట్ల లాభాల కోసమే మోదీ పని చేస్తున్నారని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారని దీనివల్ల నిత్యవసర రేట్లు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం మోపి వారి నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వస్తున్న మోదీని ఈ దేశ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్పి అధికారం నుంచి సాగనంపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్న పెంచలయ్య, నగర సహాయ కార్యదర్శి బండి చలపతి, నగర కార్యవర్గ సభ్యులు, ఎండి రవి, ఉదయ్ కుమార్, ఎం శివ, జింక నాగరాజు, పద్మనాభ రెడ్డి, గోవిందస్వామి, రామచంద్రయ్య, శ్రీనివాసులు, రామకృష్ణ, వెంకటేష్, సురేష్, ప్రమీలమ్మ, రాము, బాబు, సెందిల్, వినయ్, ఓం రాజ్ తదితరులు పాల్గొన్నారు.
