పెట్రో ధరలతో పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ

పెట్రో ధరలతో పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ

  • ఎన్నికల తర్వాత ప్రజలపై భారం మోపుత‌రా?
  • నీట్‌ను నేషనల్ లీకేజ్ ఏజెన్సీగా మార్చారు
  • విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుందని విమర్శ
  • చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ
  • సంగారెడ్డిలో కేంద్రంపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఘాటు విమర్శలు

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ బీజేపీ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోంద‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి నివాసంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. ఇంధ‌న ధరలను ఒక్కసారిగా రూ.3 పెంచడం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని మంత్రి విమర్శించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు ధరలు పెంచకుండా, ఎన్నికల అనంతరం పెంపు చేపట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల చివరి దశకు ముందు ధరలు పెరగవని చెప్పిన అధికారులు, ఇప్పుడు పెంచ‌డం ద్వారా ఓటర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడైనా ఉపశమనం కల్పించిందా అని ప్రశ్నించిన మంత్రి, ఇంకా ధరలు పెరుగుతాయనే సంకేతాలు ఇస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై అదనపు భారం మోపి పేదల నడ్డి విరచడమే బీజేపీ అసలు స్వరూపం అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రజలను విభజించడం బీజేపీ ల‌క్ష్యం
రాజకీయ అంశాలపై స్పందిస్తూ.. ప్రజలను విభజించడం, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు స్నేహపూర్వకంగా జీవించాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు విజ్ఞానవంతులని, బీజేపీ కుట్ర రాజకీయాలను అంగీకరించరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికే కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులందరూ సమిష్టిగా పనిచేస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారీగా ధాన్యం మార్కెట్‌కు వచ్చిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు కొనసాగుతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తున్నారని, చివరి గింజ వరకు మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.

నీట్ పరీక్ష లీకేజీ ఘటనపై స్పందిస్తూ.. నీట్ ఎగ్జామ్‌ను నేషనల్ లీకేజ్ ఏజెన్సీగా మార్చారని విమర్శించారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రంలోని ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వం ఆడుకుందని ఆరోపించారు. ఎన్నో ఏండ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టాలను చుట్టాలుగా బీఆర్‌ఎస్ ఉపయోగించినట్లు మేము చేయమ‌ని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని బీజేపీ మంత్రి కొడుకు కేసుపై స్పందిస్తూ మంత్రి స్పష్టం చేశారు. ఈ స‌మావేశంలో ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు.

Leave a Reply