ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి

  • జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మండల విద్యాశాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం విద్యార్థుల నమోదు అంశంపై మండల విద్యాశాఖ అధికారులు, హెడ్‌మాస్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్ సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల నమోదు పెంపునకు లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. ఆ లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 1వ తరగతికి, అలాగే 5వ తరగతి నుంచి 6వ తరగతికి విద్యార్థుల మార్పిడి ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు.

ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 1వ తరగతిలో చేరికలు పెంచేందుకు ఉపాధ్యాయులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నాయని వివరించి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రోత్సహించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమర్థవంతంగా బోధిస్తున్నారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలే అంగీకరిస్తున్నాయని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

2025-26 విద్యా సంవత్సరానికి 1 నుండి 10వ తరగతి వరకు మొత్తం నమోదు సంఖ్య 2,55,000 ఉండగా, ఈసారి దానిని 10 శాతం పెంచి 2,81,000 లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే 2,36,000 నమోదులు పూర్తయ్యాయని, ఇంకా 45,000 నమోదులు చేయాల్సి ఉందన్నారు.

తరగతుల వారీగా మార్పిడి (ట్రాన్సిషన్) పరిశీలిస్తే 5వ తరగతి నుంచి 6వ తరగతికి వెళ్లే దశలో అధిక గ్యాప్ కనిపిస్తోందన్నారు. మిగతా తరగతుల్లో 80 నుండి 90 శాతం వరకు నమోదు సాధించినప్పటికీ, 5వ తరగతి నుంచి 6వ తరగతికి మాత్రం కేవలం 56 శాతం మాత్రమే సాధ్యమైందన్నారు.

5వ తరగతి నుంచి 6వ తరగతికి 17,595 మంది విద్యార్థులను మాత్రమే పంపగలిగామని, ఇంకా 13,510 మంది పెండింగ్‌లో ఉన్నారని తెలిపారు. ఈ పెండింగ్‌ను పూర్తి చేయాలంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి యొక్క PEN (Permanent Enrollment Number), ఆధార్ వివరాలను సమర్పించాలని సూచించారు. అన్ని మండల విద్యాశాఖ అధికారులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రక్రియను ఈరోజులోపే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.