కర్నూలులో వైసీపీ నాయకుల భారీ ర్యాలీ

కర్నూలులో వైసీపీ నాయకుల భారీ ర్యాలీ
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ:
వైసీపీ నాయకులపై నమోదైన పలు కేసులకు నిరసనగా గురువారం కర్నూలు నగరంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
వైసీపీ నాయకులపై రాజకీయ కక్షసాధింపుతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని నేతలు పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీవ్ర ఆరోపణలు
జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మంత్రి టీజీ భరత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కర్నూలులో నిర్వహించనున్న వైసీపీ ధర్నాకు సంబంధించి మాట్లాడిన ఆయన, అభివృద్ధి కోసం మంత్రి పదవి ఇచ్చినా ప్రజా సమస్యలను పక్కనబెట్టి వైసీపీ నాయకులపై దౌర్జన్యాలు చేయిస్తున్నారని విమర్శించారు.
మంత్రి టీజీ భరత్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించిన సిద్ధార్థరెడ్డి, “లోకేష్‌కు తెలియకుండా రూ.45 కోట్లు కొట్టేశాడు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను తండ్రి సంపాదించిన ఆస్తులను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని, డబ్బులు కట్టి పదవులు సంపాదించలేదని స్పష్టం చేశారు.
ప్రస్తుత పాలనలో అమాయకులపై ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆరోపించిన ఆయన, ప్రజలు 20 సంవత్సరాలు గుర్తుంచుకునేలా పరిపాలన చేయాల్సిందిపోయి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కర్నూలు ప్రభుత్వాసుపత్రి, మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి జరుగుతోందని ఆరోపించిన సిద్ధార్థరెడ్డి, కూటమి ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్లలో కూడా పంచాయతీలకు రేట్లు నిర్ణయించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే గురువారం కర్నూలులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

