గోదాం వద్ద ట్రాక్టర్ ఇంజన్ చోరీ.. రైతులో ఆందోళన

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని గోదాం వద్ద ట్రాక్టర్ ఇంజన్ చోరీకి గురైన ఘటన గురువారం కలకలం రేపింది. ఒకవైపు ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం, మరోవైపు ట్రాక్టర్ చోరీతో రైతు ఆందోళన చెందుతున్నాడు.

స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. మునిపెల్లి గ్రామానికి చెందిన నల్ల ప్రభాకర్ రెడ్డి యాజమాన్యంలోని టీఎస్ 18 ఎఫ్ – 9377 నంబర్ గల ట్రాక్టర్‌లో అదే గ్రామానికి చెందిన అయిండ్ల సక్కరయ్యకు చెందిన మొక్కజొన్న సంచులను గోదాంలో అన్‌లోడ్ చేయడానికి బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తీసుకెళ్లారు.

గోదాం వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో అన్‌లోడ్ చేయడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో ట్రాలీతో సహా ట్రాక్టర్‌ను అక్కడే నిలిపి ఉంచి వెళ్లారు. గురువారం ఉదయం వెళ్లి చూడగా లోడ్‌తో ఉన్న ట్రాలీ మాత్రమే ఉండగా, ఇంజన్‌తో కూడిన ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Leave a Reply