దీవుల అభివృద్ధికి అపర భగీరథుడు మండలి వెంకట కృష్ణారావు

దీవుల అభివృద్ధికి అపర భగీరథుడు మండలి వెంకట కృష్ణారావు

నాగాయలంక, ఆంధ్రప్రభ: దీవుల అభివృద్ధికి అలుపెరగని విక్రమార్కునిలా స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు కృషి చేశారని ఎదురుమొండి వాసులు స్మరించుకున్నారు. గురువారం నాగాయలంక మండలం ఎదురుమొండి దీవిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆయన శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

శత జయంతి నిర్వహణ కమిటీ, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ… 1956 నుంచే మండలి వెంకట కృష్ణారావు ఎదురుమొండి, ఈలచెట్లదిబ్బ దీవుల అభివృద్ధి కోసం ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారని తెలిపారు. సముద్రపు కరకట్టలు, నీటి ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, సాగునీటి సౌకర్యాలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఆయన నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.

దీవుల అభివృద్ధి కోసం అనేకసార్లు ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో పర్యటించి నిధులు సాధించారని తెలిపారు. కృష్ణానది వెస్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా పైప్‌లైన్ల ఏర్పాటు చేసి సాగునీరు అందించేందుకు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎదురుమొండి, ఈలచెట్లదిబ్బ దీవుల్లో వేలాది ఎకరాలను సాగులోకి తీసుకురావడంలో ఆయన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.

1977 దివిసీమ ఉప్పెన సమయంలో కెనడాకు చెందిన సిడా సంస్థ సహకారంతో సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ఆరోగ్య పథకాలు అమలు చేశారని తెలిపారు. తుఫాను షెల్టర్లు, రిజర్వాయర్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయించి దీవుల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచారని పేర్కొన్నారు.

శత జయంతి సభలో పలువురు గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ దీవుల అభివృద్ధికి మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఉత్తమ విద్యార్థులకు సత్కారం

ఎదురుమొండి జడ్పీ హైస్కూల్లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, హెచ్‌ఎం బడే లలిత కుమారి, ఉపాధ్యాయుడు సీహెచ్ నాగప్రసాద్‌ను ఎమ్మెల్యే సత్కరించారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

పళ్లెం పెద్దేశ్వర్ హాస్పిటల్, అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. మొత్తం 281 మందికి గుండె, ఎముకలు, కీళ్లు, నేత్ర, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తదుపరి చికిత్సకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply