మెడ్చల్ పట్టణ సమస్యల పరిష్కారమే ధ్యేయం..

మెడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ 297
పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలు అందిస్తున్న మాజీ వైస్ ఛైర్మన్ చీర్ల రమేష్ గురువారం రోజు సి.ఎం.సి కమిషనర్ డాక్టర్ జి. సృజన నీ కలిశారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలపై ఆమెకు వినతి పత్రం సమర్పించి సుదీర్ఘంగా చర్చించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి లైబ్రరీ రోడ్ వరకు ఉన్న సుమారు 300 మీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ఈ రోడ్డును శుభ్రం చేసి నూతన సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు. మాజీ సర్పంచ్ దేవేందర్ రెడ్డి ఇంటి నుండి ముదిరాజ్ సంఘం వరకు ఉన్న 250 మీటర్ల రోడ్డును అభివృద్ధి చేసి సీసీ రోడ్ వేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని కాలనీలలో శానిటేషన్ నిర్వహణ మెరుగుపరచాలని, వీధి దీపాలు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో ప్రజలకు భద్రత కల్పించాలని సూచించారు. గుంతల మయంగా మారిన రోడ్లకు తక్షణమే సీసీ ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని కోరారు.
చీర్ల రమేష్ విన్నపంపై కమిషనర్ డాక్టర్ జి. సృజన తక్షణమే స్పందించారు. సంబంధిత అధికారులను పిలిపించి, సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ స్పందన పట్ల రమేష్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోంది. మెడ్చల్ పట్టణ అభివృద్ధి కోసం నా వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తాను. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న చీర్ల రమేష్ కృషిని స్థానిక కాలనీల ప్రజలు అభినందిస్తున్నారు.
