ఇంటి నుంచి వెళ్లిపోయిన బీటెక్ విద్యార్థి ఆచూకీ మచిలీపట్నంలో లభ్యం

ఇంటి నుంచి వెళ్లిపోయిన బీటెక్ విద్యార్థి ఆచూకీ మచిలీపట్నంలో లభ్యం

మచిలీపట్నం – ఆంధ్రప్రభ

గుడివాడకు చెందిన బీటెక్ విద్యార్థి గణేష్ మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుమారుడు కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితులు పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ తెలియకపోవటంతో గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గుడివాడ నుంచి వెళ్లిపోయిన గణేష్ మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద కనిపించాడు. స్థానికులు బీటెక్ విద్యార్థి వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మచిలీపట్నానికి చేరుకున్న తల్లిదండ్రులు గణేష్‌ను కలుసుకుని ఇంటికి తీసుకెళ్లారు.
కొడుకు సురక్షితంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గణేష్ ఆచూకీ గుర్తించి సమాచారం అందించిన స్థానికులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.